కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం భారత్ లో ఇప్పటివరకు 2900 కొరోనా కేసులు నమోదు అయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య దాదాపుగా 3200 పై మాటే. అయితే ఇందులో 30% కేసులు కేవలం దేశ రాజధాని నగరంలో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమం నుండే అని కేంద్రప్రభుత్వం నిర్దారించింది.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో 1023 మందికి కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు కేంద్రం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 30శాతం తబ్లీగీ జమాత్ కార్యక్రమం సందర్భంగా వ్యాప్తి చెందినవేనన్నారు.
ఇప్పటివరకు దేశంలో 2902 కేసులు నమోదయ్యాయన్నారు. నిన్నటి నుంచి 601 పాజిటివ్ కేసులు, 12 మరణాలు చోటుచేసుకున్నట్టు వివరించారు. ఇప్పటివరకు 183 మంది కోలుకున్నారని తెలిపారు. కరోనా సోకిన బాధితుల్లో 9శాతం మంది 0 -20 ఏళ్ల లోపువారు కాగా.. 42శాతం మంది 21 -40 ఏళ్లు, 33 శాతం మంది 41 -60 ఏళ్ల లోపు, 17శాతం మంది 60 ఏళ్ల పైబడిన వారు ఉన్నారని వివరించారు.
ఇది ఇలా ఉండగా…. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 180 కేసులు నమోదు అయ్యాయి… అలాగే తెలంగాణాలో నిన్న రాత్రి వరకూ 229 కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా జమాత్ కు హాజరైన వారి టెస్టుల ఫలితాలు ఇప్పటికీ రాకపోవడంతో ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.



