ఆరోగ్యశ్రీ: వ్యవస్థకు పట్టిన కరోనా వైరస్?

Aarogyasri Scheme: Hidden Corruption Exposed

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాకర్షక పధకాలలో ఆరోగ్యశ్రీ ఒకటి. పార్టీలకు, రాజకీయాలకు అతీతం అన్ని ప్రభుత్వాలు దీనిని కొనసాగిస్తున్నాయి. వాటితో లక్షలాది మంది నిరుపేదలు కార్పోరేట్ స్థాయి వైద్య సేవలు, లక్షల ఖరీదు చేసే వైద్య, శస్త్ర చికిత్సలు పొందుతున్నారు.

ఆరోగ్యశ్రీ పధకం ద్వారా లబ్దిపొందినవారు ఆ కృతజ్ఞతతో అది అందించిన పార్టీలకు ఓట్లు వేస్తున్నారు కూడా. కనుక ప్రభుత్వాలు ఈ పధకాన్ని యధాతధంగా కొనసాగించడమే కాక దానిని మరింత విస్తృతం చేస్తున్నాయి.

ADVERTISEMENT

ఇవన్నీ నాణేనికి ఒకవైపు కాగా మరోవైపు చూస్తే అనేక అవకరాలు కనిపిస్తాయి.

జిల్లా కేంద్రాలలో పెద్ద పెద్ద ప్రభుత్వాసుపత్రులు, పట్టణాలు, పల్లెలలో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు, వాటిలో వేలాదిమంది వైద్యులు, సిబ్బంది ఉండగా ఆరోగ్యశ్రీ దేనికి?అని ప్రశ్నిస్తే నిరుపేదలకు కూడా మెరుగైన వైద్య సేవల కోసమే అని చెపుతుంటారు. అంటే ప్రభుత్వాసుపత్రులలో నాసి రకమైన వైద్య సేవలున్నాయని వారు అంగీకరిస్తున్నట్లే కదా?

అటువంటప్పుడు వాటినే ఆధునీకరించి, అత్యాధునికమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేసి, మరింత మంది వైద్యులు, సిబ్బందిని భర్తీ చేస్తే వాటిలోనే మెరుగైన వైద్య సేవలు అందించవచ్చు కదా?

ఆరోగ్యశ్రీ చెల్లిస్తున్నట్లుగానే ప్రతీ 6,12 నెలలకు ఓసారి ప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రులకు నిధులు విడుదల చేస్తుంటే అవి కార్పోరేట్ స్థాయికి ఎదుగుతాయి కదా? ప్రభుత్వ పెట్టుబడి శాశ్వితంగా ప్రభుత్వం వద్దనే ఉంటుంది కదా?

కానీ ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ పేరుతో కార్పోరేట్ ఆసుపత్రులకు వేలకోట్లు ఎందుకు కట్టబడుతున్నాయి?వాటి నుంచి వచ్చే కమీషన్ల కోసమేనా?అందుకే రూ.10-25వేలలో జరగాల్సిన చికిత్సలకు, ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్ హాస్పిటల్స్ లక్షల్లో బిల్లులు చేస్తున్నాయి?

ఓ కాంట్రాక్టర్‌కి పెండింగ్ బిల్లు చెల్లించాలంటే లంచాలు తప్పనప్పుడు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నుంచి ఒక్క పైసా తీసుకోకుండానే వేలకోట్ల బిల్లులు చెల్లించేస్తున్నాయా ప్రభుత్వాలు?

మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధుమిత్రులు కార్పోరేట్ హాస్పిటల్స్ స్థాపించి, తమ పరిచయాలు, పలుకుబడితో ఆరోగ్యశ్రీ పధకం ద్వారా లబ్ది పొందుతున్న మాట నిజమా కాదా?ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ ప్రతిపక్షాలు చేసే ఆందోళనలు కూడా అసమదీయ హాస్పిటల్స్ కోసమేనా?

ప్రతీ విషయంలో తీవ్రంగా విభేధించుకునే పార్టీలు ఆరోగ్యశ్రీ విషయంలో ఏకాభిప్రాయం కలిగి ఉండటం అనుమానించాల్సిన విషయమే కదా?

ఒకవేళ ఆరోగ్యశ్రీ పేరుతో తెర వెనుక ఇదే జరుగుతుంటే, దీని కోసమే ఈ పధకాన్ని యధాతధంగా కొనసాగిస్తున్నాయని అనుకోవలసి ఉంటుంది.

ప్రభుత్వాసుపత్రులలో అరకొర వసతులున్నాయని, పాడయిన వైద్య పరికరాలు మరమత్తులకు నోచుకోక మూలపడ్డాయని తరచూ వార్తలు చూస్తూనే ఉంటాము. గౌరవ వేతనం కోసం మెడికోలు అప్పుడప్పుడు విధులు బహిష్కరించి ధర్నాలు చేస్తుంటారు.

ప్రభుత్వాసుపత్రులలో ఇన్ని సమస్యలున్నప్పటికీ కరోనా మహమ్మారి వ్యాపించినప్పుడు అవి, వాటిలో వైద్యులు, సిబ్బందే ప్రాణాలు పణంగా పెట్టి చికిత్సలు అందించారు కదా? కానీ అదే సమయంలో కార్పోరేట్ హాస్పిటల్స్ కరోనా రోగులను, వారి బంధువులను ఏవిదంగా పీల్చి పిప్పి చేశాయి కదా?

కనుక ప్రభుత్వాసుపత్రులకు, వైద్యులు, సిబ్బందిపై ఖర్చు చేయాల్సిన సొమ్ముని అప్పనంగా కార్పోరేట్ హాస్పిటల్స్‌కు దోచిపెట్టడం అవసరమా? సమంజసమేనా?కనుక ఇకనైనా ఆరోగ్యశ్రీ పధకం కొనసాగించడంపై ప్రభుత్వాలు పునరాలోచన చేసి ఆ సొమ్ముని ప్రభుత్వాసుపత్రులను మెరుగుపరిచేందుకు ఖర్చు చేస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories