స్టేజ్ పైనే అవార్డును ముక్కలు ముక్కలుగా చేసేసింది!

Adele - Beyonce Grammy Awards‘అభిమానం’ ఎంతటి పనినైనా చేపిస్తుందని చెప్పడానికి నిదర్శనం ఈ ఉదంతం. ‘మ్యూజిక్ ఆస్కార్’గా అభివర్ణించే ‘గ్రామీ అవార్డుల’ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ ఏడాది గ్రామీ అవార్డు ఉత్సవాల్లో బ్రిటిష్‌ సింగర్‌ అడెలె సత్తా చాటి, ఏకంగా అయిదు విభాగాల్లో పురస్కారాలు దక్కించుకుంది. అయితే అందుకున్న అవార్డును అక్కడికక్కడే ముక్కలు ముక్కలు చేసేసింది కూడా! ఈ ఘటనకు ఆడిటోరియంలోని వారంతా కూడా చప్పట్లు కొట్టి మరీ అడేలేను ప్రశంసించారు.

ప్రధానమైన బెస్ట్‌ ఆల్బమ్‌, బెస్ట్‌ రికార్డ్‌, బెస్ట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ మూడు విభాగాల్లో అడెలెపై అమెరికన్‌ సింగర్‌ బియాన్స్‌ ఓడిపోయింది. దీంతో తాను ఎంతగానో అభిమానించే బియాన్స్‌ కు దక్కాల్సిన అవార్డు తనకు రావడాన్ని అంగీకరించలేకపోయిన అడెలె, తనకు వచ్చిన గ్రామీ అవార్డును రెండు ముక్కలు చేసి, వేదిక పైకి బియాన్స్ ను ఆహ్వానించి, ఆమెతో పంచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీంతో అవాక్కైన ఆడిటోరియం అంతా అడేలే చేసిన పనికి అభివాదాలు తెలిపారు.

ADVERTISEMENT

మొత్తం తొమ్మిది విభాగాల్లో నామినేట్‌ అయిన అడెలె బెస్ట్‌ ఆల్బమ్‌, బెస్ట్‌ రికార్డ్‌, బెస్ట్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌, బెస్ట్‌ పాప్‌ సోలో పర్‌ ఫార్మెన్స్‌ (హలో), బెస్ట్‌ పాప్‌ వోకల్‌ ఆల్బమ్‌ విభాగాల్లో గ్రామీ పురస్కారం దక్కించుకుని సత్తా చాటడంతో, ప్రస్తుతం అభినందనల వర్షంలో మునిగి తేలుతోంది. దీనికి తోడు తన అభిమాన గాయకురాలు బియాన్స్ ను వేదికపైకి ఆహ్వానించి, అవార్డును ముక్కలు చేసి మరీ ఇవ్వడంతో ప్రస్తుతం అడేలే పేరు హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories