ఎన్నికలు రద్దు చేయాలన్నప్పుడు చొక్కా మడత పెట్టడం అవసరమా?

Jagan raises repolling demand in Pulivendula

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటు వేసేందుకు నేడు బెంగళూరు నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల వచ్చారు. తన నివాసం వద్ద జగన్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఇవేం ఎన్నికలు? స్వేచ్చగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తే మేమే గెలుస్తామని చెప్పాను. కానీ అలా జరగడం లేదు. అక్కడ టీడీపి గూండాలు పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని యధేచ్చగా రిగ్గింగ్ చేస్తుంటే, బయట పోలీసులు ఓటర్లను లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు.

ఈ ఎన్నికల్లో సిఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఇలాంటి ఎన్నికలు అవసరమా? వీటిని రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా,” అంటూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడు, పోలీస్ అధికారులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ADVERTISEMENT

అయితే జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలలో వైసీపీ నేతలు ఏవిధంగా ప్రవర్తించారు?ముఖ్యంగా తిరుపతిలో ఎన్నికల్లో ఎంత అరాచకం జరిగింది? అని ఆలోచిస్తే, ‘ఇది నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష..’ అని అనుకోవాల్సి ఉంటుంది.

అయినా రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక్క కడపలో, ముఖ్యంగా పులివెందులలో ఇంత ఉద్రిక్త పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరుకుతుంది.

కానీ ఇంత కాలం కంటి సైగతో ఓటర్లను, పోలింగ్ ప్రక్రియను శాశించడానికి అలవాటు పడిన జగన్‌ కుటుంబానికి, ఇప్పుడు అక్కడ టీడీపీ నేతలు పట్టు సాధించడం జీర్ణించుకోవడం కష్టమే.

ఇప్పటికే కడపలో మెజార్టీ స్థానాలు కోల్పోయినందున కనీసం కడప కార్పొరేషన్, పులివెందుల నైనా దక్కించుకొని పరువు నిలుపుకోవాలని ఆరాట పడటం సహజమే. కానీ అక్కడా ఓడిపోతే పరువు పోతుందని జగన్‌, వైసీపీ నేతలు ఆందోళన చెందడం కూడా సహజమే. సమంజసమే. కానీ అందుకోసం రాళ్ళు, కర్రలు బయటకు తీస్తేనే తప్పు.

ఈ నేపథ్యంలో కడపలో ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీసులు కత్తి మీద సాము చేస్తున్నారని చెప్పక తప్పదు. అందుకు వారిని అభినందించకపోగా, వారి మనోధైర్యం దెబ్బతీసేలా విమర్శించడం, వ్యవహరించడం సరికాదు.

అయినా ఈ ఎన్నికలు సక్రమంగా జరగడం లేదని, వీటి రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని జగన్‌ డిమాండ్ చేస్తునప్పుడు, ఆయనే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నానని చెప్పవచ్చు కదా? కానీ చొక్కా మడత పెట్టి పోలింగ్ కేంద్రానికి బయలుదేరడం దేనికి? ఎవరిపై యుద్ధానికి? ఏం సాధించేందుకు?

ADVERTISEMENT
Latest Stories