‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన “అజ్ఞాతవాసి” సినిమాపై ‘కాపీ’ ముద్ర పడిన విషయం తెలిసిందే. ఫ్రెంచ్ మూవీ ‘లార్గో వించ్’కు ఫ్రీమేక్ గా ఈ సినిమా నిర్మాణం జరుపుకుందన్న సమాచారంతో, అసలు ఆ సినిమా ఎలా ఉంటుందా? అన్న ఆతృతతో సదరు ఫ్రెంచ్ సినిమాను ఆన్ లైన్ లో చూసేయడం సినీ ప్రేక్షకుల వంతవుతోంది. “అజ్ఞాతవాసి” సినిమా టీజర్ ను సదరు ఫ్రెంచ్ సినిమా దర్శకుడు షేర్ చేసుకోవడం ఈ ‘కాపీ’ ఉదంతానికి మరింత బలాన్నిచ్చినట్లయ్యింది.
అందులోనూ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ అతిధి పాత్ర పోషించారన్న టాక్ తో, సదరు ఫ్రెంచ్ లో సినిమాలో మరో నటుడు కనిపించే సన్నివేశం ఏంటి? అంటూ ఆరా తీయడమే కాకుండా అందులో విక్టరీ వెంకటేష్ ను ఊహించేసుకుని మరీ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే అసలు ఇది ఇంతకి ఫ్రీమేక్ తెరకెక్కించారా? లేదా? అన్న విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. మరో పక్కన మాత్రం సదరు ఫ్రెంచ్ మూవీని యూ ట్యూబ్ లో చూసేయడం ప్రేక్షకుల వంతవుతోంది.
హిందీలో డబ్ చేసి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో యూ ట్యూబ్ లో అందుబాటులో ఉండడంతో, పరోక్షంగా “అజ్ఞాతవాసి”నే తాము చూస్తున్నామని ఫీలైపోవడం అభిమానుల వంతవుతోంది. అయితే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు అలా ఒక సినిమాను ఫ్రీమేక్ గా తెరకెక్కిస్తారా? అనేది వేచిచూడాల్సిన విషయం. ఈ విషయంలో పవర్ స్టార్ అభిమానులు కూడా కాస్తంత సహనంతో ఉండాలి. మొత్తానికి పవన్ పేరుతో సదరు ఫ్రెంచ్ మూవీకి మాత్రం బోలెడన్ని క్లిక్స్ వచ్చిపడుతున్నాయి.



