పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ తప్ప మొత్తం షూటింగ్ పూర్తి అయ్యింది. డిసెంబరులో పాటల్ని విడుదల చేస్తారు. త్వరలోనే టీజర్‌నీ చూపిస్తారని తెలుస్తోంది.
సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల కాబోతుంది. ది హెయిర్ అప్పారెంట్’ అనే ఓ ఇంగ్లిష్ చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘అజ్ఞాతవాసి’ కథ రాసుకున్నాడట త్రివిక్రమ్. దీనిలో ఎంతవరకు నిజమో తెలీదు మరి. ఓ ధనవంతుడు అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోతాడు. అతనికి ఇద్దరు భార్యలు. అతని ఆస్తంతా కాజేయాలని ఓ ముఠా కుట్ర పన్నుతుంది.
అయితే ధనవంతుడి మొదటి భార్యకి ఓ కొడుకు ఉంటాడు. తను ఎక్కడున్నాడో అంతుపట్టదు. అతని కోసం సాగించిన అన్వేషణ, అతనొచ్చాక ఎదురైన పరిణామాలే ఈ చిత్ర కథ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. పవన్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ సంచలనాలు సృష్టించాయి. ముచ్చటగా మూడో చిత్రంతో వీరిద్దరూ హ్యాట్రిక్ కొడతారేమో చూడాలి.



