విడుదల తేదీ… 2018 జనవరి 10… అంటే ఇంకా సరిగ్గా 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒక టీజర్ మరియు ఆడియో. టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా, ఆడియో ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయింది. దీంతో అభిమానుల అంచనాలన్నీ ధియేటిరికల్ ట్రైలర్ పైనే పెట్టుకున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం అయితే ఈ పాటికే ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
నిజానికి ఆడియో విడుదల రోజునే ట్రైలర్ విడుదల చేయాల్సి ఉండగా, ఆ రోజున చేయట్లేదు, 26న నేరుగా యూ ట్యూబ్ లో విడుదల చేస్తామంటూ ప్రకటన ఇచ్చారు. తీరా 26వ తేదీ వచ్చింది, ముగిసింది. కానీ “అజ్ఞాతవాసి” ట్రైలర్ జాడ మాత్రం లేదు. తాజా సమాచారం ప్రకారం అయితే జనవరి మొదటి వారంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లానింగ్ సిద్ధమైందని తెలుస్తోంది. అంటే విడుదలకు ఒక వారం రోజుల ముందు ట్రైలర్ విడుదల కావచ్చు.
ఒక్క ఆడియో వేడుక మినహా “అజ్ఞాతవాసి” సినిమాకు నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఏమీ లేవు. అది కూడా తుస్సుమనడంతో “అజ్ఞాతవాసి”కి ప్రమోషన్ కొరత స్పష్టంగా కనపడుతోంది. సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉన్నా, దానికి తగ్గట్లుగా ప్రేక్షకులను ట్యూన్ చేయడం ఎంత ముఖ్యమనేది ‘బాహుబలి 2’ (పాజిటివ్ రెస్పాన్స్) మరియు ‘స్పైడర్’ (నెగటివ్ స్పందన) నిరూపించాయి.
బహుశా ఇతర హీరోల మాదిరి పవన్ ప్రమోషన్ కార్యక్రమాలకు విచ్చేయరు గనుక, ఆ సమయంలో ధియేటిరికల్ ట్రైలర్ ను ప్రమోషన్ గా వినియోగించుకోవడానికి అమ్ముల పొదిలో దాచుకున్నారో ఏమో గానీ, ఇటు త్రివిక్రమ్ అభిమానులు, అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ “అజ్ఞాతవాసి” ట్రైలర్ కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల వలన ఏపీ, తెలంగాణాలలో పెద్దగా ప్రభావితం చూపకపోవచ్చు గానీ, ఓవర్సీస్ కలెక్షన్స్ లో మాత్రం ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి.



