పవర్ స్టార్ ఫ్యాన్స్ తో వివాదాలు కొనితెచ్చుకున్న అల్లు అర్జున్, నాటి నుండి నేటివరకు ఏదొక రూపేణా వివాదాల్లో మునిగి తేలుతున్నాడు. ఇటీవల ‘భరత్ అనే నేను’ సినిమాతో పోటీపడి, చివరికి వెనక్కి తగ్గుతారన్న టాక్ వెలువడుతున్న నేపధ్యంలో… తాజాగా ఓ సినిమా టైటిల్ అంశమై అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “నా పేరు సూర్య” అనే సినిమాలో నటిస్తోన్న బన్నీ, తదుపరి చిత్రంగా క్రిష్ ది ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం.
“అహం బ్రహ్మస్మి” అన్న టైటిల్ తో క్రిష్ దర్శకత్వంలో ఈ ఆగష్టులో సినిమా ప్రారంభం కాబోతోందని హల్చల్ చేస్తుండగా, ఇదే టైటిల్ తో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ‘ఘాజీ’ సినిమాతో సబ్ మైరైన్ కాన్సెప్ట్ ను సినీ ప్రేక్షకులకు పరిచయం చేసిన సంకల్ప్ రెడ్డి, ఈ “అహం బ్రహ్మస్మి” టైటిల్ తో గ్రహాంతరవాసులకు సంబంధించిన కధను సిద్ధం చేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోన్న టాక్.
ఇలా ఒకే టైటిల్ “అహం బ్రహ్మస్మి” ఇద్దరు మెగా హీరోల సినిమాలకు వినిపిస్తుండడం విశేషం. దీంతో చివరికి ఈ టైటిల్ ఎవరికీ దక్కుతుందోనన్న ఆసక్తితో సినీ జనాలు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా ఇలాంటి టైటిల్స్ క్రిష్ తన సినిమాలకు పెడుతుంటారు. అయితే ఇద్దరూ మెగా హీరోలే కాబట్టి అల్లు అర్జున్ కోసం వరుణ్ తేజ్ కాంప్రమైజ్ అయినా కావచ్చు. ఫైనల్ గా టైటిల్ ఏ హీరోకు దక్కినా… “అహం బ్రహ్మస్మి” అనేది మాత్రం అదిరిందనే చెప్పాలి.



