ఒకప్పుడు పెళ్లంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధం కూడా. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఒడిదుడుకులు ఎదురైనా భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలుస్తూ ముందుకు సాగుతుండేవారు.
గతంలో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన ఉన్నా లేకపోయినా సహనం, సర్దుకుపోయే మనస్తత్వం ఎక్కువగా ఉండేది. కనుక ఒకరి లోపాలను మరొకరు అంగీకరిస్తూ లేదా భరిస్తూనే కలిసి జీవించేవారు.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చిన్న చిన్న సమస్యలకే మనస్పర్థలు, గొడవలు, చివరకు విడాకుల వరకు పరిస్థితులు వెళ్తున్నాయి.
భార్యాభర్తలు తమ సొంత అభిప్రాయాలకు, ఇష్టాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదేమీ తప్పు కాదు. కానీ ఇద్దరి అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పుడు, వాటిని చర్చించి పరిష్కరించుకునే ఓర్పు ఉండటం లేదు. అయితే కొన్నిసార్లు ఓర్పు ఉన్నప్పటికీ, జీవిత భాగస్వాముల్లో ఒకరి వ్యవహారశైలి వల్ల చిన్నగా మొదలయ్యే గొడవలు విడాకుల వరకు వెళ్తున్నాయి.
అసలు వివాహ బంధాలు ఎందుకు బలహీనపడుతున్నాయి? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నప్పటికీ, ఇద్దరూ పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణంగా ఇద్దరూ కూర్చొని కబుర్లు చెప్పుకునే సమయం తగ్గిపోతోంది.
అలాగే, పని ఒత్తిడి, అలసట వంటి కారణాలతో శృంగారంపై ఆసక్తి తగ్గవచ్చు. దీనిపై పరస్పరం మాట్లాడుకోకపోతే అనుమానాలు, అపోహలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా తోడైతే.. ఇలా ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు కొండలా పేరుకుపోతున్నాయి. అవే విడాకులకు దారితీస్తున్నాయి.
సోషల్ మీడియా కూడా వైవాహిక సంబంధాల్లో కొత్త సమస్యలకు కారణమవుతోంది. ఇతరుల జీవితాలను చూసి తమ జీవితాలతో పోల్చుకోవడం, వ్యక్తిగత విషయాలను లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను బయటివారితో పంచుకోవడం వంటి అలవాట్లు కొన్నిసార్లు బంధాలపై ప్రభావం చూపుతున్నాయి.
మరికొందరికి వాస్తవ జీవితం కంటే సోషల్ మీడియాలో కనిపించే కృత్రిమ జీవితాలే చాలా బాగున్నాయని అనిపిస్తుంది. ఇది కూడా వైవాహిక బంధాలపై ప్రభావం చూపుతున్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు.
అయితే వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి మార్గమే లేదా? అంటే తప్పకుండా ఉంది. జీవిత భాగస్వాముల కోసం సమయం కేటాయించడం, మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం అవసరం.
జీవిత భాగస్వామి ఆలోచనా విధానం మనకు భిన్నంగా ఉన్నప్పుడు, వారిని పూర్తిగా మార్చాలని ప్రయత్నించకుండా, ఆ భేదాలతో ఎలా కలిసి జీవించాలో ఆలోచించాలి. అలాగని హింస, వేధింపులు, నిరంతర అవమానాలు ఎదురైనప్పుడు వాటిని భరిస్తూ ఉండటమే పరిష్కారం కాదు.
ఈ ప్రపంచంలో కోట్లాది మంది మనుషుల వేలిముద్రలు వేర్వేరుగా ఉన్నట్లే, ప్రతి మనిషి ఆలోచనా విధానం, మనస్తత్వం కూడా ఇతరులకంటే భిన్నంగా ఉంటాయి.
ప్రతి మనిషి పూర్తిగా చదవని పుస్తకం వంటివాడే. అలాంటప్పుడు జీవిత భాగస్వామి మనసులో ఏముందో తెలుసుకోవడానికి, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడానికి చాలా ఓపిక అవసరం.
కానీ ఆ పుస్తకాన్ని చదవకుండానే ఒక అంచనా వేసుకొని నిర్ణయాలు తీసుకుంటే ఆ బంధం నిలబడటం చాలా కష్టం. కనుక మన ఇంట్లోని ఆ పుస్తకాన్ని చాలా ఓపికగా చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తేనే దాంపత్య జీవితాలు సంతోషంగా సాగుతాయి.





