దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్న అనంతరం, కాస్త హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసి హాట్ టాపిక్ అయిన అమాలాపాల్, తన కాస్ట్యూమ్స్ పైనే ఎందుకు దృష్టి కేంద్రీకరిస్తారంటూ ఇటీవల మండిపడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఆలోచనలు ఎక్కువయ్యాయంటూ నెటిజన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించిన అమలాపాల్, తాజాగా అభిమానులకు ఓ క్లాసిక్ టచ్ ఇచ్చింది.
ఎప్పుడూ పొట్టి పొట్టి డ్రెస్ లను ధరించి బోర్ కొట్టిందో ఏమో గానీ, ఈ సారి సంప్రదాయపు చీరకట్టును సింగారించి దర్శనమిచ్చింది. సహజంగా చీరకట్టులో ఏ మహిళ అయినా మెరిసిపోతుంటుంది. మరి సహజ సౌందర్యంతో ఉట్టిపడే ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో వీక్షకులను ఆకర్షించకుండా ఉండగలదా? పసుపు చీరలో వెనక్కి తిరుగుతూ ఐ మూలగా చూస్తున్న ఈ ‘ఇద్దరమ్మాయిలతో’ హీరోయిన్, మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.



