
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పదేళ్ళ క్రితం విడిపోయినప్పటికీ నేటికీ రెండు రాష్ట్రాలలో రాజకీయాలు ఇంచుమించు ఒకేలా సాగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేలకోట్లు దోచుకున్నారని, అభివృద్ధి పేరు చెప్పి లక్షల కోట్లు అప్పులు చేసి ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారంటూ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు.
Also Read – దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
ఇక్కడ శాసనసభలో సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తూ, రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయడం వలన రాష్ట్రానికి సుమారు రూ.55 వేల కోట్లు, అమరావతిని నిలిపివేయడం వలన మరో రూ.2-3 లక్షల కోట్లు నష్టం జరిగిందని చెప్పారు. జగన్ ఏ అభివృద్ధి చేయకపోయినా ఈ 5 ఏళ్ళలో రూ.9.74 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పారు.
ఈ అప్పులు, వాటి వడ్డీలకే ఏడాదికి రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఇద్దరు ముఖ్యమంత్రులు చెపుతున్నారు. ఈ ఆర్ధిక విధ్వంసం వలన అభివృధ్ది పనులు, సంక్షేమ పధకాల అమలుకి ఇబ్బంది కలుగుతోందని ఇద్దరూ చెపుతున్నారు.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
కానీ వారికి పాలన చేతకాక, హామీలు అమలుచేయలేకనే అబద్దాలు చెపుతున్నారని ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ వాదిస్తున్నారు.
చంద్రబాబు నాయుడుపై ద్వేషంతో జగన్ అమరావతిని పాడుపెట్టేస్తే, కేసీఆర్ మీద ద్వేషంతో రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలరోజులలోనే ప్రభుత్వం కూల్చేయాలని కేసీఆర్ ఆరాటపడుతుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ కోరుతున్నారు.
జగన్, కేసీఆర్ చేతిలో ఎదురుదెబ్బలు తిన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రులుకాగా, వారిని రాజకీయంగా సమాధి చేయాలని ప్రయత్నించిన జగన్, కేసీఆర్ ఒకే సమయంలో దయనీయ స్థితిలో ఉన్నారిప్పుడు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఇంత సారూప్యత కలిగి ఉండటం ఆశ్చర్యకరమే కదా?