అమరావతే ఏపీకి రాజధానిగా ఉంటుందని చెప్పిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక దానిని పక్కన పడేసి మూడు రాజధానులంటూ నాలుగేళ్ళుగా కాలక్షేపం చేస్తోంది. వైసీపీ అమరావతిని వద్దనుకొంటోంది కనుక ఒకవేళ వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయి, వేరే ప్రభుత్వం వచ్చినా అది అక్కడ రాజధానిని ఏర్పాటు చేయలేని పరిస్థితులు సృష్టిస్తోంది.
అక్కడ ఒక్కో పేద కుటుంబానికి సెంటు భూమి చొప్పున 50 వేల మందికి ఇళ్ళ పట్టాలు పంచిపెడుతోంది. రాష్ట్రంలో వేరే జిల్లాలలో లేదా అమరావతి చుట్టుపక్కల జిల్లాలలో పేదలకు భూములు పంచిపెట్టవచ్చు. కానీ రాజధాని కోసం రైతులు ఇచ్చిన అమరావతిలోనే భూములు పంచిపెడుతోంది. ఇవికాక అమరావతి అభివృద్ధి కోసమని చెపుతూ రాజధాని ప్రాంతంలో భూములు వేలం వేస్తూ, గత ప్రభుత్వం నిర్మించిన వేలాది భవనాలను దీర్గకాలానికి లీజుకి ఇస్తోంది. అంటే ప్రభుత్వం మారి అమరావతి నిర్మాణాలు కొనసాగిద్దామనుకొన్నా అక్కడి భూములు, భవనాలు ప్రభుత్వం చేతిలో ఉండవన్నమాట!
వైసీపీ పేదల భుజంపై తుపాకీ పెట్టి టిడిపికి గురిపెడుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తమ ప్రభుత్వం పేదలకు భూములు ఇళ్ళస్థలాలు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే టిడిపి సుప్రీంకోర్టుకి వెళ్ళి నాలుగేళ్ళపాటు అడ్డుపడిందని మంత్రులు చెప్పుకొంటున్నారు. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు టిడిపికి చెంపదెబ్బ వంటిదని వాదిస్తుండటమే ఇందుకు నిదర్శనం.
అయితే ఆ సెంటు భూముల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోదని మాత్రమే చెప్పింది తప్ప భూముల పంపిణీ చట్టబద్దమే అని చెప్పలేదు. అమరావతి రాజధాని కేసులో తుది తీర్పుకు లోబడి ఆ భూముల యాజమాన్యపు హక్కులను నిర్దారిస్తామని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పింది. అంటే ఒకవేళ అమరావతి, సీఆర్‌డీఏ చట్టానికి అనుకూలంగా తీర్పు వచ్చిన్నట్లయితే, వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు పంచిపెడుతున్న ఆ భూములన్నీ పేదలకు చెందవు. ఒకవేళ వాటిలో వారు ఇళ్ళు నిర్మించుకొన్నట్లయితే వాటినీ వారు నష్టపోతారు.
ఇక దీనిలో మరో రాజకీయ కోణం కూడా కనిపిస్తోంది. అమరావతి ప్రజలకు వైసీపీ హ్యాండ్ ఇచ్చినందుకు ఈసారి కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు దానికి వ్యతిరేకంగా ఓట్లు వేయవచ్చు. బహుశః అందుకే వైసీపీ ప్రభుత్వం బయటివారిని తీసుకువచ్చి అమరావతిలో భూములు పంచిపెట్టి తన ఓటు బ్యాంక్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.
అంతేకాదు… టిడిపి, జనసేనలకి ఓట్లు వేసి గెలిపిస్తే, వారు అధికారంలోకి రాగానే మీ భూములను వెనక్కు తీసేసుకొంటారని పేదలను భయపెట్టి, వైసీపీకి ఓట్లు వేయించుకొనే గొప్ప దురాలోచన కూడా సెంటి భూముల వెనుక కనిపిస్తోయింది. గూడు కోసం అలమటిస్తున్న నిరుపేదల బలహీనతనే వైసీపీకి రాజకీయ పెట్టుబడిగా చేసుకొంటూ సెంటు భూములు పంచిపెడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ తన రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కొరకు పేద ప్రజల జీవితాలతో ఆటలాడుతోందని వాదిస్తున్నాయి.
ఒకవేళ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే, సెంటు భూమికి ఆశపడిన ఆ నిరుపేదలే నష్టపోతారు. అప్పుడు వైసీపీ అందుకు బాధ్యత వహిస్తుందా? వారందరికీ నష్టపరిహారం చెల్లిస్తుందా?అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బుదవారం సాయంత్రం విశాఖలోని పెందుర్తి జంక్షన్ వద్ద బహిరంగసభలో మాట్లాడుతూ, “సిఎం జగన్ తన కోసం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో డజన్లు కొద్దీ గదులు కలిగిన సువిశాలమైన భవనాలను కట్టుకొని విలాసవంతంగా జీవిస్తూ, నిరుపేదలకు కేవలం ‘సెంటు భూమి’ ఇస్తూ వారిని అవమానిస్తున్నారు. సెంటు భూమి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారు,” అని విమర్శించారు.



