సినిమాలలో జోనర్స్, కొన్ని నిర్దిష్ట ఫార్మాట్స్ ఉన్నట్లే రాజకీయాలలో కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటే పెద్ద గ్రంధం అవుతుంది.
కనుక అవినీతి కేసులు, నోటీసులు, అరెస్టులు, జైలు గురించి అమలులో ఉన్న కొన్ని ఫార్మాట్స్ చెప్పుకుని అసలు కథలోకి వెళ్దాం.
ఇటువంటి సందర్భాలలో ప్రతిపక్ష నేతలు చెప్పే స్టాండర్డ్ డైలాగ్స్.. ఇది రాజకీయ కక్షతో నమోదు చేసిన అక్రమ కేసు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. ఈ కేసులు, విచారణకు, జైలుకు భయపడను. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకముంది. బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు.. నేను ఆణిముత్యాన్ని. చివరికి న్యాయం ధర్మం గెలిచింది.
వివేకా హత్య తర్వాత దీనిలో మరో కొత్త డైలాగ్ చేర్చారు. అధికారులు ఫలానా సాక్షిని బెదిరించి మాకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వమని ఒత్తిడి చేశారని.
ఇలాంటి డైలాగుల జాబితా కూడా చాలా పెద్దదే ఉంది. కనుక వీటిని ఇంతవరకే తీసుకొని మద్యం రవాణా కుంభకోణంలో ఈడీ నోటీస్ అందుకున్న మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గురించి ఇప్పుడు నాలుగు ముక్కలు చెప్పుకుందాం.
ఆయనేమన్నారంటే, ప్రతీ రోజూ రాత్రి రాయల్ సెల్యూట్ 90 ఎంఎల్ వేసుకుంటాను. కనుక నాకు అదొక్కటే తెలుసు. ఈ మద్యం రవాణా కేసు గురించి నాకేమీ తెలీదు.. అంటూ పైన పేర్కొన్న స్టాండర్డ్ డైలాగ్స్ అన్నీ చెప్పిన తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ ఈడీపై ఒత్తిడి చేసి నన్ను ఈ కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు.
ఈడీ అధికారులు ఈ కేసులో నా పేరు చెప్పాలంటూ ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న మర్రి సుబ్బారెడ్డిని కొట్టారు. అలా ఈ అక్రమ కేసులో నా పేరు చేర్చి ఈ నెల 24న విచారణకు హాజరు కావాలంటూ నాకు నోటీస్ పంపారు. వాట్సప్ ద్వారా కాకుండా లిఖితపూర్వకంగా నోటీస్ పంపాలని కోరాను. పంపితే నేను మా న్యాయవాదితో చర్చించుకొని సమాధానం ఇస్తాను.
ఈ కేసులో నన్ను సాక్షిగా పిలిచి తర్వాత నిందితుడుగా మార్చి జైలుకు పంపించాలనుకుంతున్నారేమో? నేను ఇలాంటి తప్పుడు కేసులకు, జైలుకు వెళ్ళేందుకు భయపడను,” అని అన్నారు.
అసలు మద్యం కుంభకోణమే జరుగలేదని వైసీపీ నేతలు వాదిస్తున్నప్పుడు, మద్యం రవాణా కుంభకోణం జరిగిందని ఎలా అంగీకరిస్తారు? కనుక ఈ రెండు కేసులలో సిట్ విచారణను తప్పు పడుతున్నారు.
బాగానే ఉంది. కానీ సిట్‌తో సంబంధం లేని ఈడీ ఈ రెండో కేసులో రూ.195 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తోందంటే అర్థం ఏమిటి?
ఈ కేసుతో సంబంధం లేదంటున్న అంబటి రాంబాబుకి ఈడీ ఊసుపోక నోటీస్ పంపించదు కదా?ఒకవేళ అంబటి రాంబాబుకు సంబంధం లేకపోతే ఈడీ కోరినట్లు మర్రి సుబ్బారెడ్డి తదితరుల నుంచి తనకు, తన కుటుంబ సభ్యుల, తన సంస్థల బ్యాంక్ ఖాతాలకు ఎటువంటి నగదు బదిలీ కాలేదని నిరూపించుకుంటే సరిపోతుంది కదా?
కానీ తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్లు అప్పుడే జైలుకు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారంటే అర్థం ఏమిటి?




