పాపం దానం నాగేందర్‌! హైకోర్టు చేత అనర్హత వేటు!

Danam Nagender Disqualified by Telangana High Court

తెలంగాణలో, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ రాజకీయ నాయకుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయన అనర్హత పిటిషన్‌పై సుదీర్గంగా విచారణ జరిపిన న్యాయస్థానం నేడు తుది తీర్పు వెలువరిస్తూ, అయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఆయనపై అనర్హత వేటు వేయాల్సిన స్పీకర్‌ ఆయనకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. 2024 ఏప్రిల్‌ నెల నుంచే దానం నాగేందర్‌ అనర్హతకు గురయ్యారని కనుక అయన సీటు ఖాళీ అయినట్లు పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది.

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరిపై బీఆర్ఎస్‌ పార్టీ స్పీకర్‌కు పిర్యాదు చేయగా, అయన విచారణ పేరుతో చాలా సమయం తీసుకున్నారు. దాంతో బీఆర్ఎస్‌ నేతలు సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, స్పీకర్‌ మరికొంత గడువు తీసుకొని ఒక్కొక్కరి నుంచి వివరణ తీసుకున్నారు. వారిలో చాలా మంది తమ వేతనం నుంచి ప్రతీనెలా రూ. 5,000 చొప్పున బీఆర్ఎస్‌ పార్టీ బ్యాంక్ ఖాతాలో జమా అవుతోందని కనుక తాము బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నామని తెలియజేయడంతో స్పీకర్‌ వారి మాటనే పరిగణనలోకి తీసుకుని వారిపై అనర్హత పిటిషన్లను కొట్టి వేశారు.

ADVERTISEMENT

కానీ వారిలో దానం నాగేందర్‌, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా 2024 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేయడంతో అడ్డంగా దొరికిపోయారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసినందున ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్‌ పార్టీ కోరినప్పటికీ స్పీకర్‌ ఉపేక్షించడంతో ఇప్పుడు హైకోర్టు ఆయనపై అనర్హత వేటు వేసింది.

దానం నాగేందర్‌ ఇదివరకే సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. కనుక దానిపై తీర్పు వెలువడేవరకు హైకోర్టు తీర్పుపై స్టే కోరవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఇటీవల కాలంలో పార్టీ మారిన ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు వేయడం ఇదే మొదటిసారి.

కేసీఆర్‌ ఫామ్‌హౌసు, వారి కుటుంబం భూముల వ్యవహారంలో సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలతో, చేయిస్తున్న సర్వేతో బీఆర్ఎస్‌ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో హైకోర్టు చెప్పిన ఈ తీర్పుతో కాస్త ఉపశమనం లభించిందనే చెప్పవచ్చు. ఇది సిఎం రేవంత్‌ రెడ్డికి చెంపదెబ్బ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుపడుతూ ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం చేయవచ్చు.

ADVERTISEMENT
Latest Stories