మేనల్లుడు మజ్జి శ్రీను టీడీపిలోకి వెళ్ళిపోయినందుకు మొన్నటి వరకు కన్నీళ్ళు కార్చిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు చాలా హుషారుగా ఉన్నారు. ఎందుకంటే, అదే మేనల్లుడు పుణ్యమాని కుమార్తె అనూషకు ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టగానే భీమిలి ఇన్‌ఛార్జ్ పదవి లభించింది. అంటే వచ్చే ఎన్నికలలో ఆమెకు భీమిలి టికెట్ ఖాయమైనట్లే. ఒక తండ్రికి ఇంతకంటే సంతోషం ఏముంటుంది?
ఆలోగా మేనల్లుడు ఖాళీ చేసిన విజయనగరం జెడ్పీ చైర్ పర్సన్ సీటు కూడా ఆయన కుమార్తెకు సంపాదించి పెట్టగలిగితే దాంతో బొత్సవారి ఇంట్లో మరో పదవి లభిస్తుంది. ఆ పదవి,అధికారంతో పాటు ఆమెకు రాజకీయ అనుభవం కూడా వస్తుంది. వచ్చే ఎన్నికలకు ఈ మాత్రం శిక్షణ సరిపోతుంది. చీపురుపల్లి టికెట్ బొత్సకే జగన్ ఖాయం చేయడం ఆయన సంతోషానికి మరో కారణం.
కానీ ఈ సంతోషంలో తన మేనల్లుడు మజ్జి శ్రీనుని ఉద్దేశ్యించి చెప్పిన కొన్ని నిజాలు వైసీపీ హయంలో ఏం జరిగేదో బయటపెట్టారు.
“వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతలు భూదందాలు, అక్రమ వ్యాపార లావాదేవీలు జరిపారు. తమ పదవులు, అధికారం అడ్డుపెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారు. ఇబ్బడి ముబ్బడిగా సంపాదించుకున్నారు.
అలాంటివారే ఇప్పుడు తమ అక్రమ సంపాదనని, ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ మారారు. అలాంటి వినీతిపరులు బయటకు వెళ్ళిపోవడం వలన వైసీపీకి లాభమే తప్ప నష్టం ఉండదు.
నీతి నిజాయితీ, విలువలు కలిగిన ఏ కుటుంబమూ టీడీపిలో చేరదు. నీతి నిజాయితీ గల గౌరవ ప్రదమైన కుటుంబాలు, ప్రజాసేవకు అంకింతమైన నేతలు, నిబద్దత గల కార్యకర్తలే వైసీపీకి బలం,” అని బొత్స సత్యనారాయణ అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి పదవి కోసం బొత్స సత్యనారాయణ ఎంతగా తాపత్రయపడ్డారో, అందుకు ఆగ్రహించిన జిల్లా ప్రజలు ఏం చేశారో ప్రజలకు గుర్తుండే ఉంటుంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో ఎందుకు చేరారో.. అందుకు ప్రతిగా ఏమేమి పొందారో అందరికీ తెలుసు.
ఇంతకాలం మేనల్లుడు మజ్జి శ్రీను వైసీపీలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణకు ఆయన మంచివాడుగానే కనిపించారు. పార్టీ మారగానే అధికారం అడ్డం పెట్టుకొని అక్రమార్జనకు పాల్పడిన అవినీతిపరుడని ముద్ర వేస్తున్నారు. కానీ రేపు మేనల్లుడు నోరు విప్పితే తన రహస్యాలు బయటపడతాయని బొత్సకు తెలియదనుకోలేము.
కానీ కుమార్తె రాజకీయ ఆరంగ్రేటం బాగా జరిగిందనే సంతోషంలో పెద్దాయన నాలుగు ముక్కలు ఎక్కువ మాట్లాడేశారని మేనల్లుడు ఉపేక్షిస్తే పర్వాలేదు. లేకుంటే తెలంగాణలో కేసీఆర్ భూముల వ్యవహారంలా ఇక్కడా మరో కొత్త కథ మొదలవుతుంది.





