వచ్చే శాసనసభ ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొదలు అంబటి రాంబాబు వరకు అందరూ బల్లగుద్ది చెబుతున్నారు. వారికి అంత నమ్మకం ఉండటం చాలా సంతోషమే.
అయితే ముందుగా అంబటి రాంబాబు ఏమన్నారో చూద్దాం. ఈరోజు అయన మీడియాతో మాట్లాడుతూ, “సుప్రీంకోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపి నాయకులు, పోలీసులు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కలిసి ఈ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారు. అలాంటప్పుడు ఎన్నికలు నిర్వహించడం దేనికి?
అయితే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచినా అది నిజమైన గెలుపు కాదు.
ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలకు మేము అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. వారికి సహకరిస్తున్న పోలీస్ అధికారులు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు,” అని అంబటి రాంబాబు హెచ్చరించారు.
శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు చాలా చాలా చిన్నవి. కానీ ఇలాంటి ఎన్నికలను ఎదుర్కోవడానికే వైసీపీ ఇంతగా తడబడుతోంది.
ఆడలేక మద్దెల ఓడన్నట్లు బీసీ రిజర్వేషన్లు మొదలు ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రతీ దశలో హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తడుతూనే ఉంది. అయినా అన్యాయం, అక్రమం అంటూ వాదిస్తూనే ఉంది. ప్రత్యర్థులతో ఘర్షణ పడుతూనే ఉంది. దాడులకు పాల్పడుతూనే ఉంది.
తమ అభ్యర్ధులను నామినేషన్స్ వేయనీయడం లేదంటూనే కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అన్నీ కలిపి సుమారు 22,000కు పైగా నామినేషన్స్ వేయించింది. అయినా అంబటి మాటల్లో గెలుస్తామనే ధీమా కనిపించడం లేదు.
ఇంత చిన్న ఎన్నికలలోనే వైసీపీ గెలిచే పరిస్థితి లేనప్పుడు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఎలా గెలవగలదు?
ఒకవేళ అంబటి చెప్పినట్లు టీడీపీ నేతలు, పోలీసులు, ప్రభుత్వాధికారులు, ఎన్నికల సంఘం అధికారులు అందరూ కుమక్కు అయ్యుంటే, రేపు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి కదా? అప్పుడు ఎలా గెలుస్తారు?
పైగా ఈడీ, సీబీఐలు కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేతిలోనే ఉన్నాయని వైసీపీ వాదిస్తోంది కదా? ఇంత శక్తివంతుడైన చంద్రబాబు నాయుడుని సింగిల్ సింహం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఓడించగలరు? లేదని తెలిసినా ‘ఈసారి మేమే’ అని చెప్పుకోవడం పగటికలా? లేక 175/175లాగ మరో ఆత్మవంచనా?





