ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? విశాఖ రాజధాని చేయాలి. కనుక విశాఖ రాజధాని అంటే ఏమిటి? రుషికొండపై రూ.500 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన విలాసవంతమైన ప్యాలస్‌లేనా?
కాదు.. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసి చూపుతోంది కూటమి ప్రభుత్వం. నగరంలో అనేక ఐటి కంపెనీలు వస్తున్నాయి. భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వచ్చేసింది. అటు అనకాపల్లి జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు అనేక పరిశ్రమలు, కొత్తగా పోర్టులు ఏర్పాటవుతున్నాయి.
విశాఖ నగరం అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ స్థంభాలు లేకుండా అండర్ గ్రౌండ్ కేబిలింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయిస్తున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడితే మొత్తం ఓ ప్రాంతం అంతా అంధకారంలో మునిగిపోకుండా నివారించేందుకు ఎక్కడికక్కడ విద్యుత్ సర్క్యూట్ బ్రేకర్స్ ఏర్పాటు చేయిస్తున్నారు.
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో తరచూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, సినిమా ఈవెంట్స్, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమావేశాలు జరుగుతుంటాయి. కనుక వాటిని నిర్వహించుకునేందుకు వీలుగా సముద్రతీరంలో కాపులుప్పాడ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రభుత్వం ‘ఆంధ్ర మండపం’ నిర్మించబోతోంది. దీని కోసం ఏపీఐఐసీ (డీఎస్సీ, ఏపీపీఎస్సీ కావు) టెండర్లు పిలిచింది.
సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఈ ‘ఆంధ్రా మండపం’ పేరుకు తగ్గట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పేవిధంగా ఉంటుంది.
దీనిలో 5,000 మందితో సమావేశం నిర్వహించుకునేందుకు వీలుగా సకల సౌకర్యాలతో నిర్మించబోతున్నారు. ఈ సదస్సులు, కార్యక్రమాలకు హాజరయ్యే దేశవిదేశీ ప్రతినిధుల బస ఏర్పాట్లు కూడా దీనిలోనే చేయబోతున్నారు. ఆంధ్రా మండపంలోనే ఓ స్టార్ హోటల్, సకల సౌకర్యాలతో 250 గదులు కూడా నిర్మించబోతున్నారు.
అటు అన్నమ్మయ్య జిల్లాలో తంబళ్లపల్లి మొదలు ఇటు ప్రకాశం, విశాఖ వరకు కృష్ణ, గోదావరి నదులను పారిస్తూ అభివృద్ధి అంటే ఇదీ అని చూపుతున్నారు.
విశాఖలో ఇంకా చాలా చాలా పనులే జరుగుతున్నాయి. అన్నీ ప్రజాధనంతోనే నిర్మిస్తున్నారు. కనుక ప్రతీ అభివృద్ధి పని ప్రజల కోసమే.. వారికి ఉపయోగపడేవే చేస్తోంది. అదీ… విశాఖని రాజధాని చేయకుండానే అభివృద్ధి చేస్తోంది.





