AP Assembly Budjet Sessionఏపీ అసెంబ్లీలో ఆర్ధికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో టీడీపీ – వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధమే జరిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి టీవీల ముందు కూర్చున్న ఏపీ ప్రజలకు.., సామాజిక వేత్తలకు… సభలో జరుగుతున్న గందరగోళ పరిస్థితులను చూసి విసుగు రాక మానదనేది సత్యం.

ఏపీ అసెంబ్లీలో బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్ తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతోందని…, దేశ అభివృద్ధి రేటు కన్నా రాష్ట్ర అభివృద్ధి రేటు ఎక్కువగా ఉందనేది ప్రభుత్వ మాట. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం అంకెల గారడీతో బుగ్గన ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని ఎదురుదాడి చేసింది.

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంతా తప్పులతడకగా ఉందని, అందులో ఏ మాత్రం వాస్తవాలు లేవని టీడీపీ చెప్తోంది. “చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటే,” ఇప్పుడు “జగన్ పాలనలో అక్రమాలలో” ముందుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సభలో తన గళాన్ని వినిపించారు.

ఇలా అధికార – విపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సభను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రతిపక్షాన్ని నిలువరించే ప్రయత్నం చేసారు. ‘మీకు ఇష్టం ఉంటే సభలో ఉండండి, లేకుంటే సభ విచిపెట్టి బయటకు వెళ్ళమని., ఈ విధంగా సభలో వాదనకు దిగితే చూస్తూ ఊరుకోనని., మీకిదే నా ఫైనల్ వార్నింగ్’ అంటూ తన వైసీపీ స్టైల్ లో హెచ్చరించారు.

స్పీకర్ వైఖరితో ఆగ్రహించిన టీడీపీ నాయకులు తమ్మినేనిపై తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. వైసీపీ ప్రభుత్వానికి స్పీకర్ ఏకపక్షంగా వ్వవహరిస్తున్నారంటూ., ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తమను ‘అధ్యక్ష’ స్థానంలో ఉన్న తమ్మినేని అడ్డుకోవడం చాలా బాధాకరం అంటూ టీడీపీ నేతలు స్పీకర్ పై తమ ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. “అధ్యక్షా..! మీరే అడ్డుకుంటారా..!” అంటూ తెలుగు తమ్ముళ్లు తమ్మినేనిని సూటిగా ప్రశ్నిస్తున్నారు.