
శాసనసభ సమావేశాలంటే జగన్, కేసీఆర్‌లకు వెన్నులో వణుకు మొదలవుతుంతుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పంపించి కేసీఆర్ మొహం చాటేశారు.
శాసనసభ సమావేశాలకు హాజరవ్వాలని, కావాలంటే కారు కూడా పంపిస్తామని సిఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేసీఆర్ హాజరు కాలేదు. శాసనసభ సమావేశాలకు హాజరుకానప్పటికీ నల్గొండలో ఎన్నికల సభలో కేసీఆర్ పాల్గొనడంతో విమర్శలపాలయ్యారు.
Also Read – భారత్ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు
ఈ నెల 23 నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ కేసీఆర్ హాజరైతే సమావేశాలలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ తదితర అంశాలను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి, మంత్రులు శాసనసభ వేదికగా కేసీఆర్‌ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయక మానరు. కనుక ఈసారైనా కేసీఆర్ సమావేశాలకు హాజరవుతారా లేదో అనుమానమే.
జగన్మోహన్ రెడ్డి పులివెందుల ప్యాలస్‌లో కూర్చొని రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ ట్వీట్ చేస్తున్నారు. కనుక త్వరలో మొదలయ్యే ఏపీ శాసనసభ సమావేశాలలో పాల్గొని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడానికి ఆయనకు మంచి అవకాశం లభించింది.
Also Read – కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
కానీ “శాసనసభలో మనకి బలం లేదు. చంద్రబాబు నాయుడు మనకి ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవిస్తారనే నమ్మకమూ లేదు. కనుక శాసనసభ సమావేశాలలో మనకి పెద్దగా పని ఉండదు,” అంటూ సమావేశాలకు హాజరయ్యే ఆలోచన లేదని జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పేశారు.
ఆనాడు తాను, తన ఎమ్మెల్యేలు కలిసి ఏవిదంగా చంద్రబాబు నాయుడు దారుణంగా అవమానించి కన్నీళ్ళు పెట్టుకునేలా చేశామో జగన్ కూడా మరిచిపోలేరు. కనుక ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తనను అంత కంటే దారునంగా అవమానిస్తారని జగన్ భయపడుతుండటం సహజమే.
Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
చంద్రబాబు నాయుడు ముసలోడు తాను యువకుడిని మరో 25-30 రాజకీయాలు చేయగల వయసు, సామర్ధ్యం రెండూ తనకు పుష్కలంగా ఉన్నాయని జగన్ గర్వంగా చెప్పుకున్నారు. ఆనాడు టిడిపి ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేసినా చంద్రబాబు నాయుడు ఒక్కరే శాసనసభలో జగన్ ముఠాని ధైర్యంగా ఎదుర్కొని పోరాడారు.
కనుక జగన్ కూడా తన 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని ధైర్యంగా శాసనసభ అనే పద్మవ్యూహలో ప్రవేశించి అర్జునిడిలా దానిని ఛేదించి చూపితే ఆయన మాటలకు విలువ ఉంటుంది. అధికార పార్టీని ఎదుర్కోగల ధైర్యం, సామర్ధ్యం రెండూ ఉన్నాయని నిరూపించుకోగలుగుతారు. కానీ మొహం చాటేస్తే పిరికిపందగా మిగిలిపోతారని మరిచిపోకూడదు.
జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రావడానికి చాలా భయపడుతున్నారని చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుకే తొలి సమావేశాలలో ఆయనను ఎవరూ బెదర గొట్టకుండా కట్టడి చేసి సగౌరవంగా ప్రమాణ స్వీకారం చేసేలా చేశారు. ఇప్పుడూ అలా కట్టడి చేస్తే తప్ప జగన్‌ని శాసనసభకు రప్పించడం కష్టమే. ఒకవేళ చేసినా వస్తారనే నమ్మకం లేదు. కనుక జగన్ కోరుకున్నట్లుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చి అయినా శాసనసభకు రప్పించగలిగితే బాగుంటుంది.