తెలంగాణ ప్రభుత్వం ఈ 9 ఏళ్లలో ఒక్క హైదరాబాద్ నగరంలోనే సుమారు 25-30 ఫ్లైఓవర్లు, స్కై వాక్స్, దుర్గంచెరువు కేబిల్ బ్రిడ్జ్, ఇంకా సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటివి అనేకం నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక్కటే రాజధానిగా ఉన్నప్పటికీ, అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట, సిరిసిల్లా జిల్లాలను అద్భుతంగా అభివృద్ధి చేసి చూపింది. జిల్లాలను అభివృద్ధి చేయడమే కాకుండా సుందరీకరణ పనులు చేపడుతూ, హరితహారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనం కూడా పెంచుతోంది.
అలాగే ప్రతీ జిల్లాలలో పారిశ్రామికవాడలు లేదా ఐటి హబ్‌లు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు నిర్మిస్తూ ఏ జిల్లా ప్రజలు, యువత, విద్యార్థులు ఆ జిల్లాలలోనే ఉన్నత చదువులు చదువుకొని అక్కడే మంచి ఉద్యోగాలు సంపాదించుకొనే అవకాశం కల్పిస్తోంది.
హైదరాబాద్‌కు ధీటుగా కరీంనగర్‌లో మానేరు నదిపై తెలంగాణ ప్రభుత్వం రూ.224 కోట్లు వ్యయంతో ఓ కేబిల్ బ్రిడ్జి నిర్మించింది. దానిని మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్నారు.
కేబిల్ బ్రిడ్జ్ అంటే కేవలం వాహనాలు తిరిగేందుకు మాత్రమే కాదన్నట్లు దానిపై కొరియన్ సాంకేతిక పరిజ్ఞానంతో డైనమిక్ లైటింగ్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ వంతెనకు ఒకవైపు మిడ్ మానేరు రిజర్వాయర్, మరోవైపు రూ.410 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ కనిపిస్తుంది.
కనుక ఈ వంతెనపై ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రతీ ఆదివారం సాయంత్రం ఈ వంతెనపై సౌండ్ అండ్ లైట్ షో నిర్వహిస్తారు. కనుక సాయంత్రం నుంచి దీనిపై వాహనాల రాకపోకలను నిషేదిస్తారు. కనుక ఇదో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా కూడా మారబోతోంది.
శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా-ఆంధ్రా రాష్ట్రాలను కలుపుతూ బ్రిటిష్ కాలంలో ఓ వంతెన నిర్మించారు. అది ఎప్పుడైనా కూలిపోతుందని స్థానికులు, అధికారులు ప్రభుత్వానికి విన్నవించుకొంటూనే ఉన్నారు. దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని బ్రతిమాలుకోంటూనే ఉన్నారు. కానీ నిర్మించకపోవడంతో ఒడిశా నుంచి గ్రానైట్ లోడుతో ఏపీకి వస్తున్న ఓ ట్రక్కుతో సహా ఆ వంతెన కుప్ప కూలిపోయింది. తర్వాత అయినా కొత్త వంతెన నిర్మాణం మొదలుపెడతారనుకొంటె, కూలిపోయిన ఆ వంతెనకు ఇరువైపులా అడ్డుగా రెండు గోడలు నిర్మించి, దానిఐ వంతెన కూలిపోయింది కనుక రాకపోకలు నిషేధం అని వ్రాయించి పెట్టారు. కానీ ఏపీ-ఒడిశాలను కలిపే అతి ముఖ్యమైన మార్గం అదే. కనుక వంతెన పక్కన నుంచి వాహనాలు కిందకు దిగి మట్టిరోడ్డులో ప్రయాణిస్తున్నాయి. నాలుగైదు రోజుల క్రితం మరో భారీ వాహనం అలాగే ప్రయాణించబోతే అది కూడా బోర్లాపడింది. అధికారులు అతికష్టం మీద క్రేన్ సాయంతో ఆ వాహనాన్ని పక్కకు తప్పించి దారి కల్పించారు. ఇదీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వంతెనల పరిస్థితి! అన్నం ఉడికిందో లేదో తెలుసుకొనేందుకు ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అంటే ఇదేనేమో?
గమ్మతైన విషయం ఏమిటంటే, కరీంనగర్‌లో కేబిల్ బ్రిడ్జి గురించి వైసీపీ అధికార పత్రిక సాక్షిలో అనేక ఫోటోలతో ఓ వార్త ప్రచురించింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కళ్ళకు కట్టిన్నట్లు సాక్షి మీడియా కూడా చూపుతోంది. కానీ ఏపీలో అటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చూపలేకపోతోంది? ఎందుకంటే నాలుగేళ్లుగా మూడు రాజధానుల కబుర్లతో, సంక్షేమ పధకాల గొప్పలతో కాలక్షేపం చేసేసిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తోంది కనుక! అయినా చెప్పుకొనేందుకు, చూపేందుకు చేసిందేమీ లేదు కనుక!



