“చివరికి పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టికెట్ ధరలను కూడా నిర్ణయిస్తే, ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈ రోజు మాట్లాడతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి, ఇటువంటి వాళ్ళు పేదల గురించి ఆలోచన చేసేవాళ్లేనా? ఇటువంటి వాళ్ళు పేదల గురించి పట్టించుకునే వారేనా?
ఇటువంటి వారందరూ కూడా పేద వాడికి శత్రువులు కాదా? అని అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరతా ఉన్నా” – ఇది సినిమా టికెట్ ధరలపై అంశంపై పబ్లిక్ మీటింగ్ లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 2022 జనవరి 1వ తేదీన పలికిన పలుకులు.
“సినిమా టికెట్ ధరలు పెంచమని అడిగిన వారందరూ పేద వాడికి శత్రువులే” అన్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం చెప్పినట్లయింది. అయితే అసలింతకీ జగన్ మోహన్ రెడ్డి ఎవరిని టార్గెట్ చేసినట్లు? టికెట్ ధరలు పెంచమని అడుగుతున్నది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, ధియేటర్ ఓనర్లు మరియు ఇతర సినీ క్రాఫ్ట్స్.
వీళ్ళు పేద వాళ్ళకు శత్రువులు అనడానికి సంబంధం ఏమిటి? సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఇంతవరకు ఎలాంటి పొలిటికల్ డైలాగ్ లు వాడలేదే? కేవలం తమ కష్టాలను మీడియాల వేదికగా చెప్పుకున్నారు తప్ప, వైసీపీ సర్కార్ పై గానీ, వారు గత రెండేళ్లుగా అందిస్తోన్న అద్భుతమైన పరిపాలనపై గానీ ఏ కామెంట్ చేయలేదే?
మరి ఏపీ సీఎం ఎవరి పైకి గురిపెట్టి ఈ బాణాలు వేసారో? రాష్ట్రంలో ఏ రచ్చ జరిగినా దానికి ప్రత్యర్థి పార్టీలే కారణమనే భావనను ప్రజల్లోకి పంపి, తద్వారా రాజకీయ లబ్ది చేకూర్చుకోవాలనే భావనలో ఈ విమర్శలు చేసారా? మొన్నటివరకు అమరావతి ఉద్యమం వెనుక టిడిపి ఉందన్న విధంగా, ఈ సినిమా రచ్చ వెనుక కూడా టిడిపియే ఉందని చెప్పాలనుకున్నారా?
ఏమో… దీనికి జవాబైతే ఈ వ్యాఖ్యలు చేసిన సీఎం గారో లేక సామాన్యులకు బాగా అర్ధమయ్యే విధంగా చెప్పే వైసీపీ నేతలైనా వెల్లడించాలి. అయితే ఈ వ్యాఖ్యల ద్వారా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది. జగన్ కు తెలియకుండా ఈ సినిమా టికెట్ ధరల రచ్చ జరిగి ఉండొచ్చు అన్న భావనను ఇటీవల ఒకరిద్దరూ వ్యక్తం చేయడంతో పాటు, జగన్ అనుకూలపు మీడియా కూడా ఈ విధంగా ప్రచారం చేసింది.
కానీ లేటెస్ట్ కామెంట్స్ తో అన్ని తనకు తెలిసే జరిగిందని, పేద వాళ్ళ కోసం తానే ఇలాంటి గొప్ప నిర్ణయం తానే తీసుకున్నానని సీఎం స్వయంగా చెప్పడంతో, వాళ్లంతా డిఫెన్స్ లో పడ్డట్లయింది. ఏ లేటెస్ట్ కామెంట్స్ తో సోషల్ మీడియా జనులు కూడా అలర్ట్ అయ్యి, మళ్ళీ సాక్షి పేపర్ మరియు భారతి సిమెంట్ ధరలు అంటూ ట్రోల్స్ కు శ్రీకారం చుట్టారు.
ఇక అత్యంత ముఖ్యమైన మరో అంశం ఏమిటంటే… ప్రభుత్వం ఏదో కమిటీ వేసింది, తద్వారా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. టికెట్ ధరలు, షోల ఇబ్బంది తొలగిపోతుందని గంపెడు ఆశతో ఉన్న టాలీవుడ్ సినీ వర్గాలకు సీఎం తాజా ప్రకటనలతో ఇప్పటికే ఓ స్పష్టత అయితే వచ్చియుండాలి. ‘ముందుంది ముసళ్ల పండగ’ అంటూ ‘అ ఆ’ సినిమా క్లైమాక్స్ లో రావు రమేష్ చేసినట్టు చేసేయడమే!
Jagan's First Response On Film Tickets Controversy#Tollywood #TicketPrices pic.twitter.com/LE3jjn4Z5P
— MIRCHI9 (@M9News) January 1, 2022



