జగన్ ప్రభుత్వం జీపీఎస్ విధానమే అమలుచేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వోద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు పోలీసులు, కేసులకు భయపడి మౌనం వహిస్తుంటే, కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు వారు రాష్ట్ర వ్యాప్తంగా సిఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపఠాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ రెండూ సహజమే.
అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు పాలాభిషేకాలు చేస్తున్నారంటే దానర్దం ప్రభుత్వోద్యోగులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని కాదు కదా?కానీ ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ పాలాభిషేకాలు చేస్తుంటే, మద్యలో టిడిపి, దాని మీడియా విషం కక్కుతూ ఏడుపులు ఏడుస్తోందని ఆత్మసాక్షి చెపుతోంది.
మంచిదే! రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులందరూ నిజమగా సంతోషంగా ఉంటే అంతకంటే ఏం కావాలి?జగన్ ప్రభుత్వం మా సమస్యలన్నీ తీర్చేసిందని, మా డీఏ బకాయిలు, తాము దాచుకొన్న సొమ్ము అంతా ప్రభుత్వం తిరిగి చెల్లించేసిందని లేదా తప్పకుండా చెల్లిస్తుందనే నమ్మకం తమకు ఉందని ఏ ఒక్క ఉద్యోగి అయినా చెప్పారా?వాళ్ళు చెప్పకపోయినా జగన్ ప్రభుత్వం ధైర్యంగా ఆ హామీ ఇవ్వగలదా?అని ఆలోచిస్తే పరిస్థితి అర్దమవుతుంది.
ఇక ఉద్యోగులు కోరుతున్నట్లు 12వ పీఆర్సీకి మంత్రివర్గ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశామని గొప్పగా చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 11వ పీఆర్సీలో బకాయిలే ఇంతవరకు పూర్తిగా చెల్లించలేదని ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నారు. ఇక 12వ పీఆర్సీపై చర్చలు ముగిసేదెప్పుడు? అమలుచేసేదెప్పుడు?ఈలోగా ఎన్నికల గంట ఎలాగూ మొగుతుంది. అప్పుడు మళ్ళీ వైసీపీని గెలిపిస్తే 12వ పీఆర్సీని అమలుచేస్తామని ఆశపెట్టకుండా ఉంటారా?ఇది కూడా ఎన్నికలకు ముందు శంకుస్థాపన వంటిదే అని అందరికీ తెలుసు.
వైసీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వారం రోజులలోగా సీపీఎస్‌ని రద్దు చేసి ఓపీఎస్‌ని అమలుచేస్తామని హామీ ఇచ్చి, నాలుగేళ్ల తర్వాత తాపీగా ఓపీఎస్ సాధ్యం కాదు జీపీఎస్ అమలుచేస్తాం నమ్మండి అంటున్న వైసీపీ ప్రభుత్వం, మళ్ళీ గెలిపిస్తే 12వ పీఆర్ఏసీ అమలుచేస్తాం అంటే ప్రభుత్వోద్యోగులు నమ్ముతారా?ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులను నయన్నో భయన్నో చీల్చి వారిచేత జేజేలు పలికించుకొని పాలాభిషేకాలు చేయించుకోవచ్చుగాక కానీ వారి చేత ఓట్లు వేయించుకోవడం అసాధ్యమే అని గుర్తిస్తే మంచిది.



