2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కి ఎంత కీలకం అనేది నేటి ప్రారంభోత్సవాలను చూస్తే యిట్టె అర్ధమవుతుంది. నాటి ఎన్నికలలో వైసీపీ ఓడిపోయి ఆంధ్రప్రదేశ్ ని గెలిపించిందా అన్న స్థాయిలో ఏపీలో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి.
రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి మొదలుపెడితే విశాఖలో ఏర్పాటుకానున్న గూగుల్ డేటా సెంటర్ నిర్మాణాలు, రాయలసీమ నీటి ప్రోజెక్టుల పురోగతి, హెచ్ఎన్ఎస్ఎస్ వంటి సాగు నీటి పనులు, విశాఖలో ఐటీ పెట్టుబడులు, ఏరోస్పేస్, రిన్యువబుల్ ఎనర్జీ రంగాలలో కొత్త అవకాశాల సృష్టి,
అలాగే శ్రీసిటీ లో విస్తరిస్తున్న పరిశ్రమలు, పోలవరం పనులు వేగవంతం, అందుబాటులోకి క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీ, భోగాపురం ఎయిర్ ఫోర్ట్ ప్రారంభోత్సవం ఇలా రాష్ట్రంలో బిఫోర్ కూటమి ఆఫ్టర్ కూటమి మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని విమర్శించాల్సిందే అనే సంప్రదాయాన్ని కాసేపు పక్కన పెట్టి వైసీపీ ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూడగలిగితే, దాని ఫలితంగా ఇక్కడి ప్రజలకు జరిగే మేలు గురించి ఆలోచించగలిగితే వైసీపీ సోషల్ మీడియా నుంచి సాక్షి వరకు కూటమి ప్రభుత్వం పై చేసే అసత్య ప్రచారాలకు కాస్త బ్రేక్ వేయవచ్చు.
ఏపీలో అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం కుంటుపడిపోయింది అనే విమర్శలు చేసే వైసీపీ ఇప్పుడు కూటమి రాకతో జరుగుతున్న అభివృద్ధి ప్రారంభోత్సవాలకు మాత్రం క్రెడిట్ కోసం ఆరాటపడడం ఏ మేరకు సమంజసం.? గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన అనేక పరిశ్రమలు తిరిగి ఏపీ సరిహద్దులు దాటిపోయాయి.
కానీ ఇప్పుడు అవే పరిశ్రమలు తిరిగి ఏపీని వెతుకుంటూ మరి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగమే విశాఖకు తిరిగొస్తున్న IBM ప్రాజెక్ట్. నాడు వైసీపీ హయాంలో పోలవరం పూర్తి ఆ దేవుడికే ఎరుక అన్న నేతలు ఇప్పుడు పోలవరం క్రెడిట్ మాదే అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు.
విశాఖలో ఎయిర్ ఫోర్ట్ ఉందిగా ఇక భోగాపురం ఎయిర్ ఫోర్ట్ ఎందుకు అంటూ నాడు ఎయిర్ ఫోర్ట్ నిర్మాణం మీద అడ్డుపుల్లలు వేసిన నేతలు ఇప్పుడు ఆ ఎయిర్ ఫోర్ట్ ప్రారంభోత్సవానికి కర్త, కర్మ, క్రియ తామే అంటూ డప్పులు కొట్టుకుంటున్నారు.
రాష్ట్రంలో జరిగే అభివృద్ధి, నిర్మాణాలు రాష్ట్ర రాజకీయాల బట్టి ఆగిపోవు, పోకూడదు అనేది వైసీపీ ఇప్పటికైనా గ్రహించాలి. వైసీపీ 2.0 అధికారంలోకి వస్తే అమరావతిని ఆపేస్తాం, మావిగన్ ను ముందుకుతేస్తాం, PPP విధానాన్ని రద్దు చేస్తాం, నిర్మాణాల కోసం ఇప్పటి ప్రభుత్వం తీసుకున్న భూములను వెనక్కిస్తాం అంటూ అడ్డగోలు ప్రకటనలు చేయడం వైసీపీ క్రెడిబిలిటీ ని రాజకీయంగా దెబ్బతీస్తుంది.




