APJAC employees strikeప్రభుత్వ ఉద్యోగులు – జగన్ సర్కార్ నడుమ రాజుకున్న “పీఆర్సీ” రగడకు శుభంకార్డు పడేలా కనపడడం లేదు. కొత్తగా విడుదల చేసిన పీఆర్సీని వెనక్కి తీసుకున్న తర్వాతే చర్చలైనా, ఇంకా ఏమైనా అని ఉద్యోగులు చెప్తుండగా, కొత్త పీఆర్సీ జీవోను వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదు, చర్చలు జరుపుతామని ప్రభుత్వం చెప్తోంది.

దీంతో తమ ఉద్యమ కార్యాచరణకు ప్రభుత్వ ఉద్యోగులు శ్రీకారం చుట్టారు. నేడు హైకోర్టు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ, సీఎస్ ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులను కలిసే ఆలోచన సీఎస్ కు లేదన్నట్లుగా తెలుస్తోంది.

నేడు మొదలుకుని ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి వరకు నిరసన కార్యక్రమాలు జరిపి, అప్పటికి ప్రభుత్వం వెనక్కి తగ్గని పక్షంలో సమ్మె బాట పట్టనున్నారు. జనవరి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించనున్నారు. అలాగే అంబేద్కర్ విగ్రహానికి వినపటిపత్రాలు సమర్పించనున్నారు.

జనవరి 27వ తేదీ నుండి 30 వరకు అన్ని జిల్లా కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడకు పిలుపునివ్వగా, 5వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది సహాయ నిరాకరణ అమలు చేయనున్నారు. ఇక అంతిమంగా ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుండి నిరవధిక సమ్మె చేయనున్నారు.

ఈ నడుమ ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొంటాయో గానీ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఉండవల్లి లాంటి వాళ్ళు ప్రెస్ నోట్ ను విడుదల చేస్తూ విజ్ఞప్తి చేసారు. ఉద్యోగులు కార్యాచరణ ఇలా ఉంటే, వాళ్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కూడా అదే స్థాయిలో పావులు కడుపుతోందన్నది పొలిటికల్ టాక్.