ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం మనకి గుర్తులేదు కానీ…

Andhra Pradesh Formation Day celebration debate after state split

ఒకప్పుడు నవంబర్‌ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకునేవారు. ఊరూ వాడా ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ…’ గీతం శ్రావ్యంగా వినిపించేది. జనవరి 26, ఆగస్ట్ 15న దేశవ్యాప్తంగా ప్రజలలో ఎటువంటి దేశభక్తిభావం కనిపిస్తుందో, నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవంనాడు అటువంటి భావమే ప్రజలలో కనిపించేది. కానీ ఇప్పుడు అది కూడా ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.

కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు అవతరణ దినోత్సవం ఏర్పడింది. కనుక ఏటా జూలై 2న ఘనంగా జరుపుకుంటోంది.

ADVERTISEMENT

కానీ మనం కూడా అదే రోజున జరుకోవాలా లేదా ఎప్పటిలాగే నవంబర్‌ 1న జరుపుకోవాలా?అనే సందిగ్దత ఏర్పడింది. దీనిపై శాసనసభలో అధికార, ప్రతిపక్షాలు చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావచ్చు. కానీ వాటి మద్య రాజకీయ శత్రుత్వం అందుకు అడ్డొచ్చింది.

కనుక రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు జూలై 2 నుంచి 10 రోజుల పాటు నవ్యాంద్ర నిర్మాణ దినోత్సవాలు జరుపుకోవాలని నిర్ణయించారు. కానీ వైసీపీ అధినేత నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.

రాష్ట్ర గౌరవం, ప్రజల మనోభావాలు ముడిపడున్న ఈ అంశంపై కూడా రెండు ప్రధాన పార్టీలు ఇలా వ్యవహరించడంతో ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం ప్రాముఖ్యత కోల్పోయిందని చెప్పక తప్పదు.

రాజధాని లేని రాష్ట్రంగా తీరని అప్రదిష్ట పాలైన ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలో కూడా తెలియని అయోమయంలో ఉండనే సన్నాయి నొక్కులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ టీడీపి, వైసీపీలు నేటికీ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి. వాటికి వాటి రాజకీయాలే ముఖ్యం అయ్యాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో కూడా ఇటువంటి సందిగ్దత, రాజకీయాలు సరికాదు.

రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు మరిచిపోయినా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరిచిపోలేదు. సోషల్ మీడియా ద్వారా నేడు (నవంబర్‌ 1) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ తేదీని ఖరారు చేసి ఎప్పటిలాగే అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది.

ADVERTISEMENT
Latest Stories