వాలంటీర్లను కాదు… వారిని వాడుకుంటున్నవారిపై చర్యలు అవసరం

Village_Volunteers

జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఈ మే13న జరుగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కోసమే సుమారు 2.5 లక్షల వాలంటీర్ల సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిని దేని కోసం ఏర్పాటు చేసుకున్నారో ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది.

వైసీపి అభ్యర్ధులు వాలంటీర్ల చేత ఎన్నికల ప్రచారం చేయించుకుంటున్నారు. వారి ఒత్తిళ్ళు భరించలేక వాలంటీర్లు మెడలో వైసీపి కండువాలు వేసుకొని మరీ వైసీపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ADVERTISEMENT

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్‌ మీనా హెచ్చరిస్తున్నప్పటికీ, వైసీపి నేతలు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. దీంతో ఇప్పటి వరకు 40 మంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించిన్నట్లు మీనా చెప్పారు. ఒకవేళ ఇంకా ఎవరైనా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లయితే, వారినీ తొలగిస్తామని హెచ్చరించారు.

మచిలీపట్నం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) తరపున బందరు మండలం చిన్నాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆరుగురు వాలంటీర్లపై ఎంపీడీవో వేటు వేశారు. కడప జిల్లాలో జమ్మల మడుగులో ఎన్నికల ప్రచారం చేస్తున్న 11 మంది వాలంటీర్లపై కూడా వేటు పడింది.

అయితే వాలంటీర్లు నెలకు కేవలం రూ.5,000 జీతానికి వైసీపికి, ఆ పార్టీ నేతలకు ఇన్నేళ్ళుగా వెట్టి చాకిరీ ఎందుకు చేస్తున్నారంటే కుటుంబాలను పోషించుకోవడం కోసమే. కనుక వారిని విధుల నుంచి తొలగించడం కంటే, వారి చేత ఎన్నికల ప్రచారం చేయించుకుంటున్న స్థానిక వైసీపి అభ్యర్ధులపైనే కేసులు నమోదు చేసి, ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు తగిన చర్యలు తీసుకోవడం మొదలుపెడితేనే వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచడం సాధ్యపడుతుంది. లేకుంటే వైసీపి నేతలే వారి చేతిలో ఓ రూ.5,000 పెట్టి ప్రచారం చేయించుకుంటూనే ఉంటారు.

ఎసారి ఎన్నికలలో వైసీపి నేతలు పెట్రేగిపోకుండా ఎన్నికల సంఘం చేత నియంత్రింపజేసేందుకే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. లేకుంటే బీజేపీతో టిడిపికి పొత్తు అవసరమే లేదు. దాని వలన ఉపయోగం కూడా లేదు.

కనుక ఏపీ ఎన్నికల సంఘం ఇలా మొక్కుబడిగా వాలంటీర్లపై వేటు వేసి చేతులు దులుపుకుంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. అప్పుడు పొత్తు ప్రయోజనం నెరవేరదు. కనుక టిడిపి, జనసేన, ఏపీ బీజేపీ నేతలే ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం మంచిది. లేకుంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదు.

ADVERTISEMENT
Latest Stories