మంత్రి పదవి ఏ రాజకీయ నాయకుడికైనా పండగే. కానీ పదవి ఊడిపోతే ఊపిరి ఆడనట్లు విలవిలలాడిపోతుంటారు. ప్రస్తుతం ఏపీలో ఈ రెండు దశలలో ఉన్న నేతలు మన కళ్ళ ముందే ఉన్నారు. మంత్రి పదవి చేపట్టిన రోజా నేడు నగరికి వచ్చినప్పుడు ఆమెకు గజమాల కూడా సరిపోదనుకున్నారో ఏమో ఏకంగా తాటిచెత్తు అంత ఎత్తున్న పూలదండను తెచ్చి ఆమె వాహనంపై అమర్చి ఊరేగిస్తుంటే రోజా కళ్ళలో ఆ ఆనందం చూసి తీర్ళాసిందే.
మరో పక్క మంత్రి పదవులు ఊడినవారు ఓ పక్క జలజలకారిపోతున్న కన్నీళ్లు తుడుచుకొంటూ ‘మేమంతా జగనన్న సైనికులం..మాకు పదవులతో పనిలేదు..మేము జగన్ కోసమే జీవిస్తాం… జగన్ కోసమే ప్రాణాలు ధారపోస్తాం…’ అంటూ అద్భుతంగా నటించేస్తున్నారు.
ఈ సంతోష, విషాదకర సన్నివేశాలు మరికొన్ని రోజులలో లేదా వారాలలో ఎలాగూ ముగిసిపోతాయి. ఆ తరువాత పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే ఇప్పుడు మంత్రి పదవులు పొందినవారు చాలా అడ్వాంటేజ్ పొందుతారని, తాజా మాజీలు తీవ్రంగా నష్టపోతారని చెప్పవచ్చు.
ఏవిదంగా అంటే, రెండున్నరేళ్ళు ఆలస్యంగా మంత్రి పదవులు లభించినప్పటికీ ఇప్పుడు పదవులు చేపట్టినవారందరూ వచ్చే ఎన్నికల వరకు మంత్రులుగానే కొనసాగుతారు. అప్పడు వారి చేతుల్లోనే అధికారం, అధికారులు, పోలీసులు, అన్నీ ఉంటాయి కనుక తమ నియోజకవర్గాలలో సులువుగా చక్రం తిప్పగలుగుతారు. ఈ చివరి రెండేళ్ళలో ప్రజలను మెప్పించగలిగితే ఎన్నికలలో వారివైపే ప్రజలు మొగ్గు చూపవచ్చు. కనుక కొత్త మంత్రులకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది.
ఇక తాజా మాజీల పరిస్థితి దయనీయంగా మారవచ్చు. మంత్రిగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు ప్రజలకు మొహం చూపించడం కాస్త ఇబ్బందే. మంత్రి పదవి ఊడింది కనుక ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గుతుంది. ఇంత కాలం తమ వెంట చేతులు కట్టుకొని పరుగులు తీసిన అధికారులు ఇప్పుడు తమ కళ్లెదుటే కొత్త మంత్రుల వెంట పరుగులు తీస్తూ తమను పట్టించుకోకపోతే పైల్స్ వంటి ఆ బాధను భరించడం చాలా కష్టం. ఎవరికీ చెప్పుకోలేరు కూడా.
పదవులు ఊడిన వారందరూ అసమర్ధులు కనుకనే జగనన్న బయటకు పంపించారని ప్రజలు అనుకొనే అవకాశం కూడా ఉంది. జగనన్నే అసమర్ధులని ముద్రవేస్తే ఇక ప్రజలు వారిని సమర్దులని అనుకోరు కదా?జగనన్న, ప్రజలు దృష్టిలో అసమర్డులుగా ఉన్నవారికి టికెట్లు లభిస్తాయో లేదో తెలీదు. ఒకవేళ ఇచ్చినా జగనన్న ఇచ్చిన ‘అసమర్ధ మంత్రి స్టిక్కర్’ నుదుటన అంటించుకొని వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తే ప్రజలు ఓట్లేస్తారో లేదో తెలీదు. కనుక ఆలస్యంగా వచ్చినా ఎన్నికల సమయానికి మంత్రి పదవిలో ఉండే కొత్తవారికే పూర్తి అడ్వాంటేజ్ ఉంటుందని భావించవచ్చు.



