ఆనాడు మహాభారతంలో పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగివచ్చిన తరువాత వారు శ్రీకృష్ణుడిని దుర్యోధనుడి వద్దకు రాయబారానికి పంపిస్తారు. పాండవుల రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు నిరాకరిస్తే కనీసం ఐదూళ్ళు ఇచ్చిన చాలని లేకుంటే కురుక్షేత్ర మహాసంగ్రామం అనివార్యమని శ్రీకృష్ణుడు సూచిస్తాడు. కానీ దుర్యోధనుడు పాండవులకు ఐదూళ్ళు ఇచ్చేందుకు నిరాకరిస్తాడు. ఆ తరువాత జరిగిన కధ అందరికీ తెలిసిందే.
మళ్ళీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య అదే సీన్ రిపీట్ అవుతుండటం విశేషం. భద్రాచలం పట్టణం, రాములోరి గుడి ముంపుకు గురవకుండా ఏపీకి చెందిన ఐదూళ్ళు ఇమ్మని తెలంగాణ ప్రభుత్వం కోరగా, ఇటువైపు నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు నిర్ద్వందంగా తిరస్కరించారు.
‘హైదరాబాద్‌ను మాకు ఇచ్చేయమని అడిగితే మీరు ఇచ్చేస్తారా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ఆనాడు కౌరవులు కూడా శ్రీకృష్ణుడుని ఇటువంటి గొంతెమ్మ కోరికలు కోరలేదని టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అంటున్నారు. భద్రాద్రి రామాలయాన్ని కాపాడుకోవడానికే ఐదూళ్ళు ఇమ్మనమని అడుగుతున్నాము తప్ప మా కోసం కాదని వాదిస్తున్నారు. కానీ ఏపీ మంత్రులు అర్దంపర్ధం లేని మాటలు మాట్లాడుతూ అగ్గి రాజేస్తున్నారని ఆరోపించారు.
టిఆర్ఎస్, వైసీపీల ప్రభుత్వాలలో కౌరవులు ఎవరో, పాండవులు ఎవరో ఎవరికి వారు ఊహించుకోవలసిందే. కానీ ఇప్పుడు విషయం ఏమిటంటే ఆనాడు భీష్మద్రోణాదులు వంటి పలువురు దుర్యోధనుడి పక్కనే నిలిచినప్పటికీ వారు పాండవులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు వినిపించేవి. ఇప్పుడూ టిఆర్ఎస్, వైసీపీ నేతల మద్య కూడా మంచి అండర్‌స్టాండింగ్ ఉందనే సంగతి అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు వారు మొదలుపెట్టిన ఈ యుద్ధం నిజమైన యుద్ధం కాదని చెప్పక తప్పదు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణలో ప్రతిపక్షాల విమర్శలు చేస్తుండటంతో, ఆ సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికే సిఎం కేసీఆర్ ముందు క్లౌడ్ బరస్ట్ అన్నారని, ఇప్పుడు పోలవరం సాకు చూపుతూ తప్పించుకోవాలని చూస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి సిఎం కేసీఆర్ ఆనాడు ఎంతగానో తోడ్పడ్డారు కనుక ఇప్పుడు మనోళ్ళు ఈవిదంగా టిఆర్ఎస్ నేతలతో ఉత్తుత్తి యుద్ధం చేస్తూ తెలంగాణలో సెంటిమెంట్ రాజేయడంలో తోడ్పడుతున్నట్లు భావించవచ్చు. కనుక ఆనాడు ఐదూళ్ళ కోసం కురుక్షేత్రం మహా సంగ్రామం జరిగి ఉండవచ్చు గానీ ఇప్పుడు జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. ఒకవేళ కేసీఆర్ జగన్ ప్రభుత్వానికి ఓ వెయ్యి కోట్లు అప్పు ఇస్తానంటే ఐదూళ్ళు ఏమి ఖర్మ పదూళ్ళు రాసిచ్చేసినా ఆశ్చర్యం లేదు.



