అన్నా లెజినోవాకి ఉంది భక్తి, నమ్మకం…కానీ మనోళ్ళకే…

Anna Lezhneva during Tirumala pilgrimage

మాది ఫలానా మతం అని చెప్పుకునేవారు దానికి కట్టుబడి ఉండరు. మళ్లీ మేము ఫలానా కులానికి చెందిన వాళ్లమని చెప్పుకుని ఓట్లు అడుగుతారు. తమ కులపోళ్లకే టికెట్లు, సీట్లు, మంత్రి పదవులు, చివరికి అధికారుల పోస్టింగుల్లో కూడా మనోడికే ప్రాధాన్యం.

సరే, ఫలానా కులం అంటే హిందూ మతస్తుడేగా అనుకుంటే.. కాదు, మాది ఫలానా మతం అని చెప్పుకుంటూ ఆ మత విశ్వాసాలను ఫాలో అవుతుంటారు.

ADVERTISEMENT

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ‘డిక్లరేషన్’ ఇవ్వాలంటే ‘వద్దులే’ అని వెళ్లడం మానుకుంటారు. కానీ మేమంతా పక్కా ‘హిందూ బ్యాచ్’ అని నిరూపించుకునేందుకు పూజలు, హోమాలు చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

మన కులపోళ్లతోనే పెళ్లిళ్లు, కానీ మళ్లీ కులంతో పాటు మతం కూడా కలిసాయో లేదో చూసుకుంటారు. ఇలా ఉంటుంది కొందరి వ్యవహారం.

ఒక మతం లేదా కులంలో పుట్టడం, దానికి కట్టుబడి ఉండటం గౌరవప్రదమే తప్ప అవమానం కానే కాదు. కానీ ఈ విధంగా కులం-మతం మధ్య ‘స్విచ్చింగ్’ అవుతుండటమే తప్పు.

రాజకీయాల్లో ఇలాంటి స్విచ్చింగ్ లేకుండా మేము ఫలానా అని చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నవారు లేరా? రాణించడం లేదా? అంటే దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. మరెందుకు ఈ ‘స్విచ్చింగ్?’ అంటే అదో పెద్ద కథ అవుతుంది. కనుక ఇప్పుడా చర్చ వద్దు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవాది మన దేశం కాదు. మన మతం కూడా కాదు. కానీ పవన్ కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుని వచ్చేసి ఇక్కడ స్థిరపడిన తర్వాత హిందూ మతాచారాలను పాటిస్తున్నారు. గౌరవిస్తున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భుజానికి ఇటీవల ముంబయిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఆయనకు శస్త్రచికిత్స బాగా జరిగి త్వరగా కోలుకుంటే కాలినడకన తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారట.

ఆ మొక్కు తీర్చుకోవడానికే నేడు ఆమె సాంప్రదాయ చీరకట్టులో అలిపిరి నుంచి కాలినడకన మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్నారు.

ఆనవాయితీ ప్రకారం ఆమె ముందుగా శ్రీ భూవరాహస్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.

ఒక విదేశీయురాలు మన మతం, మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పదనాన్ని గుర్తించి అంగీకరించి పాటిస్తున్నప్పుడు, ‘మాది హిందూ బ్యాచే’ అని చెప్పుకునేవారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు?

ADVERTISEMENT
Latest Stories