ram-gopal-varma-rgv-case

దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలకే పరిమితమై ఉంటే ఆస్కార్ స్థాయి సినిమా ఒక్కటైనా తీసి ఉండేవారు. అంత గొప్ప టాలెంట్ కలిగిన వర్మ ఎందుకు దారి తప్పారో అని అందరూ అనుకుంటూనే ఉంటారు. అందరూ తలో కారణం చెప్పుకుంటూనే ఉంటారు… అని కూడా ఆయనకు తెలుసు.

Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు

అయితే ‘ఐ డోంట్ కేర్’ అంటూ తన పద్దతిలో ముందుకు సాగి ఎక్కడో ఉండాల్సిన ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండాల్సి వస్తోంది. తాను అజ్ఞాతంలోకి వెళ్ళడం గురించి సోషల్ మీడియాలో ఏం చెప్పుకుంటున్నారో కూడా నాకు తెలుసు అంటూ వర్మ మరో వీడియో పెట్టారు.

మొదటి వీడియోలో ‘వ్యవస్థలపై రాజకీయ ప్రభావం’ గురించి వివరిస్తూ తనని తాను చాలా చక్కగా సమర్ధించుకున్నారు. హత్యలు చేసినవారిపై ఏడాదికైనా కేసులు ఉండవు కానీ నన్ను వారంలోనే లోపల వేసేయాలనుకుంటున్నారు.. ఇదెక్కడి న్యాయం? అంటూ వర్మ దానిలో ప్రశ్నించారు.

Also Read – ‘గుడ్డి’ ప్రభుత్వానికి…’గుడ్డు’ మంత్రికి…’గూగుల్’ విలువ తెలుసా.?

రెండో వీడియోలో సోషల్ మీడియా గురించి తన అభిప్రాయాలు చెప్పారు. వర్మ మేధావి అని చెప్పడానికి ఈ వీడియో ఒక్కటి చాలు. “సోషల్ మీడియాకి అందరూ దేనికి వస్తారంటే ఇలాంటి గాసిప్స్ కోసమే. నేను పోలీసులకి భయపడి అజ్ఞాతంలోకి పారిపోయాను.. నా గురించి పోలీసులు వెతుకుటుంటే నేను గజగజ వణికిపోతున్నాను..” అంటూ నా గురించి ఊహించి చాలానే వ్రాశారు.

జనాలకు కూడా అటువంటి స్పైసీ గాసిప్స్ కావాలి కనుక వాటికి మంచి లైక్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇవన్నీ చాలా సహాజమని నాకు తెలుసు. కనుక నా గురించి ఎవరు ఏం వ్రాసుకున్నా చెప్పుకున్నా పట్టించుకోను. బాధపడను కూడా.

Also Read – విదేశాలకు రేషన్ బియ్యం రవాణా ఏవిదంగా అంటే..

అయితే సోషల్ మీడియాలో ఇలా ఒకరి గురించి వస్తున్న కామెంట్స్, పెడుతున్న పోస్టులని తీవ్రంగా పరిగణించి కేసులు పెట్టడం మొదలుపెడితే సోషల్ మీడియాలో 80-90 శాతం మందిపై కేసులు పెట్టాలిగా?నా ఒక్కడి మీదే ఎందుకు?నేను చెప్పదలచుకున్న ఈ పాయింట్ అందరికీ అర్దమయిందనే భావిస్తాను,” అని రాంగోపాల్ వర్మ అన్నారు.

సినీ రంగంలో ఉన్నవారికి, ముఖ్యంగా సినీ దర్శకులకి సోషల్ మీడియా తీరుతెన్నులు ఇలాగే ఉంటాయని బాగా తెలుసు. సోషల్ మీడియాలో లైకుల కోసం ఎవరినైనా టార్గెట్ చేసుకుంటారని, ఏమైనా వ్రాస్తారని తెలుసు కనుకనే వర్మలా చాలా మంది వాటిని పట్టించుకోరు.

వాటి వలన తమకి బాధ, నష్టం కలుగుతుందని తెలిసి ఉన్నప్పుడు, వారు కూడా మళ్ళీ అటువంటి తప్పే చేయకూడదు. కానీ వర్మ చేశారు కనుకనే అజ్ఞాతవాసం తప్పడం లేదు. కానీ వర్మ తాను ఏ తప్పు చేయలేదని, లోకమే తనని అనవసరంగా నిందిస్తోందని వాదిస్తూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేయడం కూడా మేధావితనమే.

కానీ వర్మ నుంచి ఇటువంటి మేధావిని ఎవరూ కోరుకోవడం లేదు. తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డ్ అందించగల సినిమా తీయాలని కోరుకుంటున్నారని వర్మ గ్రహిస్తే చాలు. కానీ వర్మ కోసం కేసులు, పోలీసులు ఎదురుచూస్తున్నారు కనుక ఆయనకు అంత టైమ్, అవకాశం ఉన్నాయా?