నాచురల్ స్టార్ నాని సినిమా “మజ్ను” ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ అను ఇమ్మానుయేల్ నక్క తోక తొక్కిందేమో అని చెప్పక తప్పదు. ఒక సాధారణ హీరోయిన్ గా ప్రారంభమైన కెరీర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” సినిమా రావడంతో, కెరీర్ మరో మలుపు తిరిగినట్లయ్యింది. దీంతో టాప్ హీరోయిన్ల సరసన చేరే అరుదైన అవకాశం చేజిక్కించుకుంది.
పవర్ స్టార్ “అజ్ఞాతవాసి” విడుదల కాకముందే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన “నా పేరు సూర్య” సినిమాలో అవకాశం చేజిక్కించుకున్న అను, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలో కూడా నటిస్తోందని ట్రేడ్ టాక్. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న బోయపాటి – రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ యే ఫైనల్ అయ్యిందన్న టాక్ ఊపందుకుంది.
రాశి ఖన్నా, అనులను పరిశీలించిన మీదట చివరగా ‘మజ్ను’ బొమ్మకే ఓటు వేసారని, ఈ ప్రభావంతో అతి తక్కువ సమయంలో ముగ్గురు టాప్ మెగా హీరోలతో నటించిన ముద్దుగుమ్మగా అను నిలిచిపోనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతేనా… ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా అనునే ఓకే కాగా, ‘శైలజా రెడ్డి అల్లుడు’లో కూడా ఈ బ్యూటీనే కన్నులవిందు చేయనుంది.



