ఫైల్స్ తగులబెడుతున్నారే… అప్పుడే సర్దేసుకుంటున్నారా?

AP CID Officers Burnts Documents

తాడేపల్లి పాతూరు రోడ్డులో ఉన్న సిట్ కార్యాలయంలో సోమవారం ఉదయం కార్యాలయ సిబ్బంది కట్టలు కట్టల కాగితాలను మంట పెట్టి తగులబెట్టారు. అవన్నీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, భువనేశ్వరి తదితరులపై సిట్ బృందం నమోదు చేసిన వివిద కేసుల తాలూకు పత్రాలు, అధికారుల మద్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు.

ఈవిషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సిట్ అధిపతి, ఐజి కొల్లి రఘురాం రెడ్డి స్పందిస్తూ, “ఆయా కేసులలో మా రికార్డుల కొరకు, నిందితుల తరపు న్యాయవాదులకు, కోర్టులకు సమర్పించేందుకు కొన్ని లక్షల కాపీలు తీశాము.

ADVERTISEMENT

ఈ సందర్భంగా జిరాక్సు మెషిన్లు వేడెక్కడం వలన కాలిపోయిన వాటిని, జిరాక్స్ మెషిన్లలో కాగితాలు ఇరుక్కుపోయి పాడైపోయిన కాపీలు మా కార్యాలయంలో చాలా పేరుకుపోయాయి. అందుకే వాటన్నిటినీ తగులబెట్టిస్తున్నాము తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.

కానీ కొన్ని మీడియా సంస్థలు మేము కీలక పత్రాలను తగులబెట్టిస్తున్నట్లు తప్పుడు కధనాలు ప్రసారం చేశాయి. ఇది దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను, విచారణాధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నంగానే భావిస్తున్నాము. ఇటువంటి ఊహాజనితమైన తప్పుడు కధనాలతో ప్రజలలో అనుమానాలు, అపోహలు సృష్టించవద్దు,” అని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. మరో 10 రోజులలో నామినేషన్స్‌ ప్రక్రియ మొదలవుతుంది. మరో నెల రోజుల్లో (మే 13) పోలింగ్‌ జరుగబోతోంది. కనుక ఇటువంటి సమయంలో ప్రతిపక్ష నేతల కేసులకు సంబందించి పత్రాలు తగులబెడితే ఎవరైనా అనుమానిస్తారు. అది సహజం.

ఒకవేళ అవన్నీ నిజంగా చెత్త కాగితాలే అయితే ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగులబెట్టవచ్చు. అప్పుడు ఎవరూ వేలెత్తి చూపించరు కదా?

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో కూడా ఇదేవిదంగా ఎన్నికలకు ముందు సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే హైదరాబాద్‌ పర్యాటక శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కొన్ని ఫైల్స్, కంప్యూటర్లు తగులబడిపోయాయి. మరో కార్యాలయంలో ఫైల్స్ దొంగతనం జరిగాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వాటిపై విచారణ జరిపిస్తోంది కూడా. కనుక తాడేపల్లి సిట్ కార్యాలయ సిబ్బంది పత్రాలను తగులబెట్టిన్నప్పుడు ఎవరికైనా అనుమానం కలుగుతుంది. అందుకే మీడియా ప్రశ్నించింది.

సిట్ కార్యాలయ ఆవరణలో తగులబెట్టిన ఆ పత్రాలలో ఏముందో, వాటిని ఇప్పుడే ఎందుకు తగులబెట్టారో, దాని గురించి మీడియాలో వచ్చిన కధనాల తప్పొప్పులను అన్నిటినీ పక్కన పెడితే, ఎన్నికలు జరుగబోతున్న సమయంలో సిట్ కార్యాలయం దీంతో జగన్‌ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోబోతోందని అందుకే ముందస్తు జాగ్రత్త పడుతోందనే సంకేతం పంపిన్నట్లయింది కదా?

తెలంగాణ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన మూడు నెలల తర్వాత కేసీఆర్‌ తన పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ, “ఎన్నికలలో మన పార్టీ ఓడిపోబోతోందనే విషయం నాకు మూడు వారాలు ముందే తెలుసు,” అని చెప్పుకొన్నట్లు వార్తలు వచ్చాయి.

బహుశః ఈసారి ఏపీ శాసనసభ ఎన్నికలలో వైసీపి కూడా ఓడిపోబోతోందని జగన్మోహన్‌ రెడ్డి ముందే గ్రహించి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారా?అని అనుమానం కలగడం సహజం. ఎందుకంటే తాటిచెట్టు కింద కూర్చొని నిజంగా పాలే తాగుతున్నా ఎవరూ నమ్మరు కదా?

ADVERTISEMENT
Latest Stories