జగన్‌ ఒంటరితనానికి కారణం ఎవరు?

Jagan

వైసీపి అధినేత ఆనాడు బటన్ నొక్కుడు సభల్లో ‘నేను ఒంటరిని ప్రజలే నాకు తోడు’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు ఎన్నికల సభలలో కూడా అదే చెప్పుకొని ప్రజల సానుభూతిని ఓట్ల రూపంలో ఆశిస్తున్నారు.

తాను ఒంటరిగా నిలిస్తే ప్రతిపక్షాలు వారి మీడియా కలిసి రాళ్ళు, బాణాలు, అబద్దాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలతో తనను చుట్టుముట్టారని జగన్‌ చెప్పుకొంటున్నారు.

ADVERTISEMENT

అసలు జగన్‌ ఎందుకు ఒంటరివాడయ్యారు? అనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. బాబాయ్ వివేకా టిడిపితోనో లేదా మరో పార్టీతోనో చేతులు కలిపి కుట్రలు చేయలేదు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉండేవారు. జగన్‌ ఒత్తిడితో వైసీపిలో చేరారు. కానీ ఆయన కధ ఎలా ముగిసిపోయిందో అందరికీ తెలుసు. ఆ కారణంగా మరో చెల్లి సునీతా రెడ్డిని శత్రువుగా మార్చుకున్నది జగనే కదా?

అక్రమాస్తుల కేసులో జగన్మోహన్‌ రెడ్డి చంచల్‌గూడా జైల్లో ఉండగా చెల్లి వైఎస్ షర్మిల కాళ్ళు ఆరిపోయేలా పాదయాత్ర చేసి వైసీపిని కాపాడింది. కానీ అధికారంలోకి వచ్చాక అన్న తనకు అన్యాయం చేశాడనే ఆవేదనతో ఆమె మౌనంగా తెలంగాణకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జగన్‌ స్వయంగా తల్లి విజయమ్మని వైసీపి నుంచి బయటకు సాగనంపేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయం నుంచి వైఎస్సార్ కుటుంబంతోనే కలిసి ప్రయాణించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నమ్మకస్తులను మెడ పట్టుకొని బయటకు గెంటేశారు.

ఈవిదంగా అందరినీ స్వయంగా దూరం చేసుకొని ఇప్పుడు నేను ఒంటరివాడినని చెప్పుకోవడం, మళ్ళీ ఆ సాకుతో ప్రజలను ఓట్లు అర్ధించడం రెండూ సిగ్గు చేటే కదా?

అయినా సొంత కుటుంబ సభ్యులే నిలదీసి ప్రశ్నిస్తుంటే, వారికి జవాబు చెప్పకుండా వారందరూ దుష్టులు దుర్మార్గులు అనే ముద్రవేసి, ‘నేను మాత్రం ఆణిముత్యాన్ని’ అని చెప్పుకోవడం చాలా హాస్యస్పదంగా ఉంది కదా?

దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏదో సమయంలో ఇతర పార్టీలతో స్నేహం చేస్తుంది లేదా ఇతర పార్టీలే స్నేహం చేయడానికి ముందుకు వస్తుంటాయి.

కేసీఆర్‌ వంటి తీవ్ర అహంభావం కలిగిన వ్యక్తి కూడా ఐదేళ్లు బీజేపీతో, పదేళ్ళు మజ్లీస్‌తో, ఉప ఎన్నికలలో ఒకసారి వామపక్షాలతో స్నేహం చేశారు. మజ్లీస్‌, వామపక్షాలు కూడా ఆయనతో స్నేహం కొనసాగించడానికే మొగ్గు చూపాయి.

కశ్మీర్‌లో వేర్పాటువాదులతో, పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులతో అంటకాగిన అక్కడి పార్టీలు కూడా ఏదో సమయంలో కాంగ్రెస్‌ లేదా బీజేపీలతో కలిసి పనిచేశాయి. కానీ ఏపీలో వైసీపికి ఏ ఒక్క పార్టీతో సఖ్యత లేదు! ఏ పార్టీ కూడా వైసీపితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. ఎందువల్ల?

ఈవిదంగా కుటుంబాన్ని, ప్రతిపక్ష పార్టీలను స్వయంగా దూరం చేసుకొని, డానికి కూడా ఇతరులను నిందిస్తుండటం, పైగా ‘నేను ఒంటరిగా మిగిలిపోయాను… మీరే నన్ను ఆదుకోవాలి,’ అంటూ ప్రజలను వేడుకోవడం, మళ్ళీ అంతలోనే ‘నేను పులిని, సింహాన్ని, అర్జునుడిని’ అని గొప్పలు చెప్పుకోవడం చాలా హాస్యస్పధంగా ఉంది.

ADVERTISEMENT
Latest Stories