YS Sharmila

రాష్ట్ర విభజనతోనే ఏపీ కాంగ్రెస్‌ చచ్చిపోయింది. దానికి వైఎస్ షర్మిల మళ్ళీ ప్రాణం పోసి బ్రతికిస్తారని కాంగ్రెస్‌ అధిష్టానం ఆశపడింది. అన్న చేతిలో మోసపోయి తెలంగాణకి వెళ్ళిన ఆమెకు అక్కడ నిలద్రొక్కుకోలేకపోవడంతో ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏపీకి తిరిగి వచ్చేసి కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన కధలన్నీ అందరికీ తెలిసినవే. కనుక ఇప్పుడు ఆ సోది అవసరం లేదు.

శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చేస్తుందనో, కనీసం కొన్ని సీట్లు అయినా గెలుచుకుంటుందనో కాంగ్రెస్‌ అధిష్టానం ఆశపడలేదు. కాంగ్రెస్ పార్టీలో నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులను వైఎస్ షర్మిల ఏదో విదంగా ఆకర్షించగలరని తద్వారా వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భావించింది.

Also Read – రేపు రెంటపాలకు జగన్‌.. ఏం ప్లాన్ చేశారో?

కానీ ఆమె ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టి అప్పుడే 7-8 నెలలు కావస్తున్నా ఇంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నేతని కూడా ఆకర్షించలేకపోయారు. కనీసం కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న సీనియర్ నేతలని ఆమె కలుపుకుపోలేకపోతున్నారు. నాదారి నాదే కాంగ్రెస్‌ దారి కాంగ్రెస్‌దే అన్నట్లు సాగిపోతున్నారు.

పార్టీ నేతలను కలుపుకుపోలేకపోవడం వలన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ షర్మిల మాత్రమే అన్నట్లు అయ్యింది. ఆమె ఎప్పుడో ఓసారి మీడియా సమావేశంలోనో లేదా సోషల్ మీడియాలోనో కనిపిస్తుంటారు. మిగిలిన సమయంలో ఆమె ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలీదు.

Also Read – ఒవైసీ రాజకీయాలు వైసీపీ కోసమేనా.?

ఎన్నికల సమయంలో కనిపించిన కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత మరి కనబడలేదు. కనుక పార్టీ కార్యక్రమాలు కూడా ఏమీ జరగడం లేదు. కనుక ఆమె ట్విట్టర్‌లో ట్వీట్స్ వేస్తూ ఏపీ కాంగ్రెస్ పార్టీని ఏవిదంగా బ్రతికిస్తారో ఆమెకి, కాంగ్రెస్‌ అధిష్టానానికే తెలియాలి.

ఇలా ట్విట్టర్‌లో రాజకీయ కాలక్షేపం చేయడానికే అయితే ఆమెకి ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. ఇలా కాలక్షేపం చేస్తుంటే ఏదో రోజు ఏపీలో రాజకీయా వాతావరణం మారకపోతుందా అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీని బ్రతికించకపోతారా? అని కాంగ్రెస్‌ అధిష్టానం ఎదురుచూస్తోందో లేక ఆమే ఏపీ కాంగ్రెస్‌ని రాజకీయ గుర్తింపు, కాలక్షేపం కోసం వాడుకుంటున్నారో?

Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసులో.. జగన్‌ కూడా?