ఏపీ కాంగ్రెస్‌: వైసీపికి అర్దమైంది… మరి టిడిపి, జనసేనలకు?

Sharmila-Pawan-Kalyan-chandrababu

ఏపీ రాజకీయాలలోకి హటాత్తుగా ఊడిపడిన వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రజల దృష్టిలో ‘ప్రత్యేక హోదా’ తెచ్చేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఆమె సొంత అన్న జగన్మోహన్‌ రెడ్డిపై నిప్పులు చెరిగేందుకు వెనకాడటం లేదు.

ఈ విషయం వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డి తొందరగానే గ్రహించారు. కనుక సొంత చెల్లి అని కూడా చూడకుండా తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఆమెపై ఎదురుదాడి చేయిస్తూ, ఆమెని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమెపై వైసీపి నేతల దాడుల వలన కూడా వైసీపికే నష్టం, ఆమెకు మరింత సానుభూతి కలుగుతుందని తెలిసి ఉన్నా ఆమెను ఎదుర్కోవడానికి వైసీపికి వేరే దారి లేదు.

ADVERTISEMENT

ఇక తెలంగాణలో ఎన్నికలకు టిడిపి దూరంగా ఉండిపోయి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు పరోక్షంగా తోడ్పడింది కనుక, ఇప్పుడు షర్మిల ద్వారా ఏపీలో టిడిపికి కాంగ్రెస్‌ కూడా తోడ్పడుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.

జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే అనుకుంటున్నారు కనుకనే ఆమెను తన రాజకీయ శత్రువుగా ప్రకటించడానికి వెనకాడలేదు. అయితే వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, టిడిపి, జనసేనలకు నిజంగా తోడ్పడుతుందా?లేక వాటి ఓట్లను కూడా చీల్చి నష్టపరుస్తుందా?అంటే రెండోదే జరిగే అవకాశం కనిపిస్తోంది.

2019 ఎన్నికలలో వైసీపి ప్రభంజనం ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి 1.17% ఓట్లు లభించాయి. అది బీజేపీ కంటే ఎక్కువే!

ఇప్పుడు వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అలాగే ఆమె కూడా తన అన్నని విమర్శిస్తూ ప్రజలను బాగానే ఆకట్టుకొంటున్నారు. కనుక ఇంత కాలం గత్యంతరం లేక వైసీపితో ఉన్న ‘కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్’ మళ్ళీ కాంగ్రెస్‌ వైపుకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది వైసీపి ఓట్లు చీల్చడమే అయినప్పటికీ, అది అక్కడితో ఆగిపోదు. రాష్ట్రంలో వివిద వర్గాల ఓట్లను కూడా చీలుతాయి.

ఇక తెలంగాణ, కర్ణాటకలలో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ, అక్కడ అనుసరించిన సరికొత్త వ్యూహాలను ఏపీలోను అమలు చేయడం ఖాయమే. ఎన్నికల గంట మ్రోగిన తర్వాత తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు, ఏపీ కాంగ్రెస్‌ తరపున ప్రచారానికి రాక మానరు.

కనుక ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మరింత ఎక్కువ ఓటింగ్ శాతం లభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికలలో ఒక్క శాతం ఓట్లు కూడా పార్టీల భవిష్యత్‌ని తారుమారు చేస్తుంటాయని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో అనేకమార్లు నిరూపితమైంది.

కనుక ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ కొల్లగొట్టబోయే ఓట్లు, దానికి పెరగబోయే ఓటింగ్ శాతం టిడిపి, జనసేనలకు శాపంగా మారినా ఆశ్చర్యం లేదు. కనుక రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షంగా భావిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా రాబోయే ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని తెలుసుగా!

ADVERTISEMENT
Latest Stories