తెలంగాణలో లక్ష కోట్ల కాళేశ్వరం కేసు కొలిక్కి వచ్చి సీబీఐ వరకు చేరుకుంది కానీ ఏపీలో ఏడాదిగా సాగుతున్న మద్యం కుంభకోణం కేసు విచారణ మాత్రం ఇంకా సాగుతూనే ఉంది. అయితే ఇందుకు ఈ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులని తప్పు పట్టలేము.
మద్యం కుంభకోణం కేసులో వారానికీ, నెలకీ ఏదో ఓ కొత్త విషయం బయటపడుతూనే ఉంది. దీంతో ఈ కేసు అంతుపట్టని బ్రహ్మ పదార్ధంలా మారింది.
ఇదే కేసులో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌసులో రూ.11 కోట్లు నగదు పట్టుబడింది. తాజాగా ఈ కేసులో మరో కొత్తగా వైఎస్ అనిల్ రెడ్డి పేరు వినిపించింది. ఈయన జగన్ పెదనాన్న జార్జిరెడ్డి రెండో కుమారుడు. చెన్నైలో ఉంటూ జగన్ అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారని టాక్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక మాఫియా వ్యవహారాలు కూడా చక్కబెట్టేవారని టాక్.
ఆయన పీఏ దేవరాజుని సిట్ అధికారులు కస్టడీలో తీసుకొని ప్రశ్నించగా అనిల్ రెడ్డి పేరు బయటపడింది. ఈ కేసులో నిందితులలో ఒకడైన రాజ్ కసిరెడ్డి డిస్టిలరీల నుంచి వసూలు అయిన కమీషన్లను వైఎస్ అనిల్ రెడ్డి తదితరులకు చేరవేసేవాడని విచారణలో బయటపడింది.
ఈ కేసులో ఇంతమంది వ్యక్తులు, ఇంత సొమ్ము, ఇన్ని లావాదేవీలు జరిగినందున దీని మూలాల వరకు చేరుకోవడానికి సిట్ అధికారులకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.
కానీ నాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేయిస్తే ఎన్నికలలో వైసీపీయే నష్టపోయింది. కనుక ఎన్నికలు దగ్గర పడేవరకు ఈ కేసు విచారణ సాగితే అప్పుడు ఇదే రాజకీయ కారణాల వలన ‘అంతిమ లబ్దిదారు’ని టచ్ చేయడానికి కూటమి ప్రభుత్వం కూడా వెనకాడే పరిస్థితి ఏర్పడవచ్చు. కనుక ఈ కేసు విచారణ వేగవంతం చేయడం చాలా అవసరం.




