ఇదివరకు ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులు, అభివృద్ధి అనే పదాలు వినపడేవే కావు. నిత్యం సంక్షేమ పధకాలు, బటన్ సభల వార్తలే! ఒకానొక దశలో అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలు అమలు చేయడమే అని నిర్ధారించేశారు కూడా!
ఇవి గాక రాజకీయ కక్ష సాధింపులు, వేధింపులు, దౌర్జన్యాలు వంటివి రోజువారి వార్తలుగా ఉండేవి. ఆ పరిస్థితులను చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికైనా మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొంటాయా?అని ప్రతీ ఒక్కరూ మధనపడేవారు.
అటువంటి క్లిష్ట సమయంలో కూడా చంద్రబాబు నాయుడు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇద్దరు మాత్రమే ప్రజలకు ధైర్యం చెపుతూ భరోసా కల్పించేవారు. లేకుంటే ఏమయ్యుండేదో?
వారిరువురూ చెప్పినట్లుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ బూతులు, మాటలు, భయం గొలిపే పాత ఆలోచనలు, విధానాలు అన్నీ తుడిచిపెట్టేశారు.
ఇప్పుడు ఏపీలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, అభివృద్ధి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కళ్ళ ముందు ఒకటొకటే ఆవిష్కరణవుతున్నాయి కూడా.
ఇప్పుడు తెలంగాణలో ‘ఇచట అన్ని రకాలా రాజకీయాలు చేయబడును’ అని బోర్డు పెట్టినట్లు రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్స్ కోసం నిన్న జరిగిన తెలంగాణ బంద్ ఇందుకు తాజా నిదర్శనం.
ఈ పార్టీలు, వాటి హడావుడి, ఈ బంద్ అన్నీ బీసీలకు రిజర్వేషన్స్ పెంపు కోసమే అయితే అందరూ సంతోషించవచ్చు. కానీ దీని కోసం ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్లో చట్ట సవరణ జరగదు. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండూ ఈ ప్రతిపాదనని తిరస్కరించాయి.
అయినా కూడా బీసీ రిజర్వేషన్స్ పేరుతో బంద్ చేశాయంటే అది వాటి రాజకీయాల కోసమే కదా?అవి పోటాపోటీగా బంద్ చేయడం చూస్తే వాటి ఆరాటం అర్దమవుతుంది. మూడు ప్రధాన పార్టీలు ఈ ఆధిపత్య పోరులో బిజీగా ఉంటే, కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న వంటి మరికొందరు దీనిని తమ రాజకీయ అభివృద్ధికి తొలి మెట్టుగా భావిస్తూ యధాశక్తిన ఈ అగ్నికి ఆజ్యం పోశారు.
ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, వాటి తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వరుస పెట్టి జరుగబోతున్నాయి. కనుక తెలంగాణలో ఈ రాజకీయాలు మరింత పెరుగుతాయి… వేడెక్కుతాయే తప్ప తగ్గవు.
నాడు ఏపీలో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు కేటీఆర్ తెలంగాణకు పెట్టుబడులు, ఐటి కంపెనీలు సాధించుకొచ్చేవారు.
ఇప్పుడు తెలంగాణలో జోరుగా రాజకీయాలు జరుగుతుంటే మంత్రి నారా లోకేష్ కూడా అదే చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి మరికొన్ని పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలను తీసుకు రావడం ఖాయమే. తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ హడావుడి నడుస్తుండగానే ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడుల గురించి మాట్లాడుకోవడం ఖాయమే!




