మొన్నటి సార్వత్రిక ఎన్నికలు రెండు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చడంతో పాటుగా రెండు రాజకీయ పార్టీల భవిష్యత్ ని ప్రశ్నార్దకంలోకి తీసుకెళ్లాయి. అయితే ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ పార్టీల పొత్తుతో కూటమి అధికారాన్ని చేపట్టగా ,తెలంగాణలో వందల నాయకులు ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందిపుచ్చుకుంది.
అయితే ఇక్కడ ఏపీలో ఈ పొత్తు మరో పదిహేనేళ్ళు ఇలానే కొనసాగాలని, అప్పుడే ఆంధ్రప్రదేశ్ తిరిగి ఊపిరి పోసుకుంటుందని జనసేన అధినేత పవన్ బలంగా విశ్వసిస్తున్నారు, విశదీకరిస్తున్నారు. ఇక ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం పదికాలాలపాటు అధికారంలో ఉండాలంటూ టీడీపీ అధినేత బాబు నొక్కి వక్కాణిస్తున్నారు.
ఇక అటు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతర్గత వివాదాలతో పార్టీ పరువును, ప్రభుత్వ ప్రతిష్టతను మీడియా పరం చేయకుండా ఐదేళ్ల పాటు సమిష్టిగా, కలిసికట్టుగా కొనసాగుతాదాం అనే ఆలోచనతో రేవంత్ తన పాలన మొదలు పెట్టారు.
అయితే తామొకటి తలిస్తే పార్టీ నాయకులు, కింద స్థాయి నేతలు, క్యాడర్ మరొకటి తలచారు అనేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలలో అంతర్గత పోరు కొన్ని కొన్ని సందర్భాలలో రచ్చకెక్కుతుంది. ఇటు తెలంగాణలో పార్టీలోని, ప్రభుత్వంలోని కొంతమంది రెడ్లు తమను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ కుటుంబం రోడ్డెక్కింది.
ఇక ఇటు ఏపీ విషయానికొస్తే మంత్రి నారాయణ ఆడియో కాల్ లీక్ కావడంతో టీడీపీ – జనసేనల మధ్య కొన్ని ప్రాంతాలలో నడుస్తున్న అంతర్గత పోరు మీడియాకెక్కాయి. ముఖ్యంగా పవన్ నియోజకవర్గమైన పిఠాపురం కేంద్రంగా గత కొంతకాలంగా లోలోపల రగులుతున్న రాజకీయ చిచ్చు నేడు నారాయణ ఆడియో కాల్ రూపంలో బయటకొచ్చింది.
దీనితో ఈ రెండు ప్రభుత్వాల నాయకులే ప్రత్యర్థి పార్టీలు, ఆయా పార్టీల నాయకులు బలపడడానికి కావలసినంత బలమైన ఆహారాన్ని అందిస్తున్నట్టయింది, అలాగే ఎన్నో రాజకీయ, వ్యక్తిగత అవమానాల తరువాత ఎంతో కష్టపడి సాధించుకున్న అధికారాన్నీ చేచేతుల నాశనం చేసుకుంటున్నట్టవుతుంది.
వీరి అంతర్గత విభేదాలు ఇటు ఏపీలో మూడు పార్టీల భవిష్యత్ ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉండగా, అలాగే అటు తెలంగాణలో పార్టీ నేతల అంతర్గత పంచాయితీ ఇలా మీడియాలో చర్చనీయాంశంగా మారితే పదేళ్ల పోరాటం తరువాత సాధించుకున్న అధికారం కాంగ్రెస్ పార్టీకి చేజారిపోయే అవకావం లేకపోలేదు.







