వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ట్రూ అప్ పేరుతో మరో బాదుడుకి సిద్దం అవుతోంది. ఇప్పటికే ఓ సారి విద్యుత్ ఛార్జీలు పెంచినా ఇంకా నష్టం వస్తోందంటూ మరో బాదుడుకి సిద్దం అవుతోంది.
విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు చేసిన ధరలకు, దానికి ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన ఛార్జీలకు మద్య చాలా వ్యత్యాసం ఉన్నందున విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టపోతున్నాయని చెపుతూ ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ట్రూఅప్ అనే పేరుతో బాదుడుకి సిద్దం అవుతున్నాయి.
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలకు 6726.79 మిలియన్ యూనిట్లను రూ.5.22 చొప్పున కొనుగోలు చేశామని, కానీ 7392.57 మిలియన్ యూనిట్లను ఒక్కో యూనిట్‌కు రూ.4.26 పైసల చొప్పున మాత్రమే వసూలు చేయడం వలన రూ.363 కోట్లు నష్టపోయామని ఏపీఎస్పీడీసీఎల్ తెలిపింది.
అదేవిదంగా విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఏపీసీపీడీసీఎల్‌కు ఈ మూడు నెలల్లో రూ. 167 కోట్లు నష్టం వచ్చిందని తెలిపింది.
అదేవిదంగా విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఏపీఈపీడీసీఎల్‌కు ఈ మూడు నెలల్లో రూ. 107 కోట్లు నష్టం వచ్చిందని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు-అమ్మకం మద్య వాటిల్లిన నష్టం రూ.637కోట్లుగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్‌సీకి తెలియజేశాయి. ఈ మొత్తాన్ని ట్రూఅప్ పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేసుకొనేందుకు అనుమతి కోరాయి.
అంటే ఇప్పటికే వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించినప్పటికీ, మళ్ళీ వాటిలో నుంచే ఈ కొత్త బకాయిలు పుట్టుకొచ్చాయన్న మాట! ఈ ప్రతిపాదనలు… కాకి లెక్కలు అన్నీ ప్రజలను మభ్య పెట్టేందుకేనని వేరే చెప్పక్కరలేదు.
నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే తక్కువలో తక్కువ యూనిట్‌కి రూ.6 నుంచి 9 వరకు ఉన్నాయి. కానీ యూనిట్‌కు రూ.4.26 పైసల చొప్పున మాత్రమే వసూలు చేస్తున్నామని విద్యుత్ పంపిణీ అబద్దాలు చెపుతున్నాయి. బహుశః వ్యవసాయానికి, వివిద వర్గాలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను కూడా దీనిలో కలిపేసి సగటున యూనిట్‌కు రూ.4.26 పైసల చొప్పున ఇస్తున్నట్లు కాకి లెక్కలు చెపుతున్నట్లు భావించవచ్చు.
రొయ్యలు, చేపల చెరువులకు, పరిశ్రమలకు ఇచ్చే రాయితీలను కుదిస్తూ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులపై అడ్డుగోలుగా ఛార్జీలు పెంచుతూ మళ్ళీ ఇప్పుడు ఈ ట్రూఅప్ పేరుతో వినియోగదారుల నుంచి ఇంకా పిండుకోవాలనుకోవడం దారుణం. వైసీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు భరించాల్సిందే తప్పదు.



