తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ సగం ఖాళీ అయియింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన అందరూ పార్టీని వీడి వెళ్ళిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
కానీ జగన్‌కు ఆ సమస్య లేదు. ఎందుకంటే ఆయన చాలా దూరదృష్టితో ఆలోచించి తన మంత్రులు, ఎమ్మెల్యేల చేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను నానా మాటలు అనిపించి వారికి ఆ రెండు పార్టీలలో చేరే అవకాశం లేకుండా చేసేశారు. వారు కూడా తమ అధినేతని ప్రసన్నం చేసుకోవడానికి నోటికి హద్దూపద్దూ లేకుండా చెలరేగిపోయారు. లేకుంటే ఈ పాటికి వైసీపి నుంచి కూడా టిడిపి, జనసేనలలోకి ఫిరాయింపులు మొదలయ్యేవే.
తాజా సమాచారం ప్రకారం ఐదుగురు వైసీపి ఎమ్మెల్సీలు టిడిపిలో చేరేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. శాసన మండలి డెప్యూటీ ఛైర్ పర్సన్ జాకియా ఖానం మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ని కలిసి పార్టీలో చేరేందుకు చంద్రబాబు నాయుడుని ఒప్పించాలని కోరిన్నట్లు తెలుస్తోంది.
జగన్ తమకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు కానీ ఏనాడూ తమని పట్టించుకోలేదని, వైసీపిలో అవమానాలు తప్ప ఏనాడూ సముచిత గౌరవం లభించలేదని ఆమె చెప్పారు. ఎన్నికలలో వైసీపి ఓడిపోయాకనే తొలిసారి జగన్ తమ మొహాలు చూశారని ఆమె చెప్పారు.
ఒకవేళ తనని చేర్చుకునేందుకు చంద్రబాబు నాయుడు అంగీకరిస్తే మరో నలుగురు ఎమ్మెల్సీలు తన వెంట టిడిపిలో వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని ఆమె మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌కి తెలిపిన్నట్లు సమాచారం.
వైసీపి ఎమ్మెల్యేలు టిడిపి, జనసేనలో చేరే పరిస్థితి లేదు. కానీ జగన్‌తో సహా వైసీపిలో ప్రతీ ఒక్కరికీ అవినీతి, అక్రమాల కేసుల భయం ఉంది.
కానీ ఆ భయంతో కూడా వారు పార్టీ మారడానికి వీల్లేకుండా చేసి జగన్ అందరినీ వైసీపిలో బందించి ఉంచుకున్నారని చెప్పక తప్పదు. కనుక వైసీపిలో బందీలుగా ఉండిపోయిన ఆ పార్టీ నేతల పరిస్థితి, భవిష్యత్ ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది. దీనికీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం కావడం విశేషమే కదా?






