రాయితీలు పొందుతూ తొలగింపులా!

Are IT layoffs betraying public trust?

ఆంధ్రప్రదేశ్‌తో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు విదేశాలలో పర్యటిస్తూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటిని ఆకర్షించేందుకు భారీగా రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తుంటారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎల్&టి కంపెనీకి విశాఖలో ఎకరం కేవలం 99 పైసలకు కేటాయించగా, గూగుల్ కంపెనీని ఆకర్షించేందుకు భారీగా రాయితీలు, భూకేటాయింపులు చేసింది.

ADVERTISEMENT

ఇంకా చాలా కంపెనీలు, పరిశ్రమలు ఏపీకి రాబోతున్నాయి. వాటన్నిటికీ కూడా ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోంది. వాటి ద్వారా లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఆయా ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెండుతాయనే ఉద్దేశ్యంతోనే ఇస్తోంది.

ప్రస్తుతం వీటి కోసం రాష్ట్రాల మద్య చాలా తీవ్రమైన పోటీ నెలకొని ఉన్నందున ఈ రాయితీలు ఇచ్చే విషయంలో కూడా పోటీ తప్పడం లేదు. కనుక రాష్ట్రాల మద్య నెలకొన్న ఈ తీవ్రమైన పోటీ కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు గరిష్ట రాయితీలు, ప్రయోజనం పొందుతున్నాయి.

కానీ అమెరికా ఆంక్షల వలన లేదా ఏఐ వలన కావచ్చు అన్ని కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తూనే ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగుల తొలగింపు తప్పడం లేదని చెపుతున్నాయి.

అవన్నీ లాభాపేక్షతోనే పనిచేస్తుంటాయి కనుక ఖర్చులు తగ్గించుకోవాలనుకోవడం, అందుకోసం ఉద్యోగులను తొలగిస్తుండటం సమంజసమే అనిపించవచ్చు.

కానీ అవి ఉద్యోగాలు కల్పిస్తాయనే నమ్మకంతోనే ప్రభుత్వాలు వాటి శక్తికి మించి రాయితీలు ఇస్తున్నాయి కదా? నిరుపేద రైతుల పొట్ట కొట్టి మరీ వారి నుంచి వందలు వేల ఎకరాలు తీసుకొని వాటికి అప్పనంగా అప్పజెపుతున్నాయి కదా?

కానీ ఇంత కారుచౌకగా వందలు, వేల ఎకరాల భూములు, రాయితీలు పొందిన తర్వాత ఐటి కంపెనీలు ఉద్యోగులను తొలగించడం అంటే అటు ప్రభుత్వాలను, ఇటు తమ ఉద్యోగులను మోసం చేస్తున్నట్లే కదా?

ప్రభుత్వాలు వాటి కోసం అటు రైతులను పీడించి భూములు తీసుకుంటూ, వాటికిచ్చే ఈ రాయితీల భారాన్ని ప్రజలపై మోపుతున్నాయి కదా?

కానీ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన ఐటి కంపెనీలు మాట తప్పి ఇలా వ్యవహరిస్తుంటే, వాటిని ప్రభుత్వాలు ఉపేక్షించడం సమంజసమేనా?

కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు అటు రైతులు నష్టపోయి, ఇటు ఉద్యోగులు నష్టపోతుంటే వాటికి రాయితీలు ఎందుకు ఇవ్వాలి? ఆలోచించాల్సిన సమయం ఇదే.

ADVERTISEMENT
Latest Stories