రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు నాడు ఎటువంటి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కున్నారో, మళ్ళీ ఇప్పుడు అధికారం చేపడితే నేడు అంతకంటే పెద్ద సమస్యలు, సవాళ్ళే ఆయన కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పవచ్చు.
నాడు రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వలేదు. రాష్ట్రానికి రాజధాని లేదు. పదేళ్ళ తర్వాత కూడా ఏపీ పరిస్థితి అలాగే ఉంది. ఆర్ధికంగా ఇంకా చితికిపోయింది కూడా.
జగన్ ప్రభుత్వం 5 ఏళ్ళు అమరావతిని పాడుబెట్టడం వలన నాడు మొదలుపెట్టిన నిర్మాణాలు చాలా వరకు దెబ్బ తిన్నాయి లేదా పాక్షికంగా దెబ్బ తిన్నాయి. కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ మొదటి నుంచి నిర్మాణ పనులు మొదలు పెట్టాల్సిరావచ్చు, ఇది ఇంకా ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. మళ్ళీ నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని పనులు మొదలు పెట్టించడానికి మళ్ళీ అంతా వ్యయప్రాయాసలు తప్పవు.
నాడు కరెంట్ కష్టాలు ఉండేవి. నేటికీ అవి అలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు విద్యుత్ ఛార్జీల భారంతో పరిశ్రమలు, ముఖ్యంగా ఆక్వా, గ్రానైట్, సిమెంట్ తదితర చిన్న, మీడియం పరిశ్రమలు దెబ్బ తిని ఆదుకునేవాడి కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే సామాన్య ప్రజలు కూడా విద్యుత్ చార్జీల భారంతో సతమతమవుతున్నారు. కనుక ఈ సమస్యను చంద్రబాబు నాయుడు పరిష్కరించాల్సి ఉంటుంది.
రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడంతో ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయింది. జగన్ ప్రభుత్వం కనీసం వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవడం వలన రైతులూ తీవ్రంగా నష్టపోతున్నారు. పంటల దిగుబడి, దానితో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. కనుక చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్దతో ఇటు వ్యవసాయ రంగాన్ని, అటు పరిశ్రమలు, పెట్టుబడులు సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది.
కానీ ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వ విధానాల వలన లేదా వైసీపి నేతల వేధింపులకు భయపడటం వలన పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏపీకి రావడం మానుకున్నాయి. ఉన్నవి కూడా మూసుకుపోయాయి. దీంతో రాష్ట్రంలో యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం మళ్ళీ ఇరుగుపొరుగు రాష్ట్రాలకు వలసలు పోతున్నారు.
అయితే ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పట్ల నమ్మకం కల్పించడమే చంద్రబాబు నాయుడు ముందున అతిపెద్ద పెద్ద సవాలని చెప్పవచ్చు. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలుచేయకుండా పక్కన పడేస్తామని జగన్ ప్రభుత్వం నిరూపించి చూపింది. కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడుని నమ్మి వేలకోట్లు పెట్టుబడి పెడితే రేపు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏమిటి?అనే పెట్టుబడిదారుల ప్రశ్నకు చంద్రబాబు నాయుడు సంతృప్తికరమైన జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అప్పుడే వారు ఏపీలో పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు స్థాపించడానికి ముందుకు వస్తారు.
ఈ 5 ఏళ్ళలో ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులలో చాలా మంది జగన్, వైసీపి నేతలకు భయపడో, భక్తితోనో వైసీపి కండువాలు వేసుకొని కార్యకర్తల్లా మారిపోయారు. అటువంటివారిని పెట్టుకొని ప్రభుత్వం నడపడం అంటే పక్కలో పాముని పెట్టుకొని పడుకున్నట్లే. కనుక ముందుగా అటువంటి కలుపు మొక్కలన్నిటినీ చంద్రబాబు నాయుడు ఏరివేయాల్సి ఉంటుంది.
ఇక ఈ 5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడుతో సహా టిడిపిలో ముఖ్యనేతలందరినీ జగన్ ఎంతగానో వేధించారు. కనుక టిడిపి నేతలందరూ జగన్, వైసీపి నేతలపై పగతో రగిలిపోతున్నారు. అలాగని వారిపై వెంటనే చర్యలు తీసుకోవడం మొదలుపెడితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. కనుక చంద్రబాబు నాయుడు చాలా ఆలోచించి వైసీపికి ముక్కుతాడు వేయవలసి ఉంటుంది.
ఇక టిడిపి, జనసేన, బీజేపీ కూటమి ప్రకటించిన ఎన్నికల వాగ్ధానాల భారం ఉండనే ఉంది. వాటి కోసం నిధులు సమకూర్చుకోవలసి ఉంది. లేకుంటే చంద్రబాబు నాయుడి విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.
అలాగని కొత్తగా అప్పులు తెచ్చేందుకు కూడా అవకాశం లేకుండా ఈ 5 ఏళ్ళలో జగన్ ప్రభుత్వం అందినకాడికి అప్పులు తెచ్చేసి అన్ని దారులు మూసేసి వెళ్ళిపోతున్నారు. పైగా జగన్ ప్రభుత్వం చేసిన ఆ అప్పులు, వడ్డీల భారం కూడా చంద్రబాబు ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది.
ఇక సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవులు, ఇతర పదవులు పంపకాలు, పవర్ షేరింగ్, మూడు పార్టీల ఉమ్మడి విధానాల ప్రకారం పాలన వంటి కొన్ని బాలారిష్టాలు ఎలాగూ ఉంటాయి.
ఇన్ని సమస్యలలో తెలంగాణలో కేసీఆర్ అధికారం కోల్పోయి రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడం ఒక్కటే చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి కాస్త ఊరట కలిగించే విషయం. లేకుంటే కేసీఆర్ సృష్టించే సమస్యలు, సవాళ్ళను కూడా ఎదుర్కోవలసి వచ్చేది.
ఏది ఏమైనప్పటికీ, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ప్రతీదీ ఏబీసీడీ నుంచి మొదలు పెట్టాల్సిందే.




