అవును. ఇప్పుడు ఈ మాట తెలంగాణలో చాలామంది నోట వినబడుతోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులతో ప్రభుత్వానికి విరోదం. ప్రభుత్వం పట్ల వారి అసంతృప్తి, అసహనాలను ఇప్పుడు పొరుగు రాష్ట్రాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. అర్దాంతరంగా నిలిచిపోయిన రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. అమరావతి-మూడు రాజధానులపై కొనసాగుతున్న రాజకీయాలు, వాదోపవాదాలు, రైతుల పాదయాత్రలు, వారిపై మంత్రుల సూటిపోటి మాటలు, అనుచిత విమర్శలను తెలంగాణ స్థిరపడిన ఆంద్రా ప్రజలు తప్పు పడుతున్నారు.
రాష్ట్ర విభజనతో ఆంద్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయినప్పటికీ 5 ఏళ్ళపాటు రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి గురించే ఎక్కువ చర్చలు, నిర్మాణాత్మక చర్యలు ఉండేవి. ఒకవేళ 2019లో మళ్ళీ టిడిపి అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఏవిదంగా ఉండేదో తెలీదు కానీ ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో రాజకీయాలు తప్ప మరేమీ జరుగుతున్నట్లు కనబడదు.
Also Read – సెలబ్రెటీలు తస్మాత్ జాగ్రత్త..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడూ రాజకీయాలతో వేడెక్కి ఉంటోంది తప్ప అభివృద్ధి జరగడం లేదని ఇరుగు పొరుగు రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలు సరిపోవన్నట్లు సంస్కరణల పేరుతో యూనివర్సిటీల పేరు మార్చడం, పాఠశాలల విలీనం వంటి అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల కారణంగా వైసీపీ ప్రభుత్వం కొత్త సమస్యలు సృష్టించుకొని బాధపడుతోందని విదేశాలలో స్థిరపడిన ఆంధ్ర ప్రజలు భావిస్తున్నారు.
చాలా దూరదృష్టి కలిగిన నాయకుడిగా పేరొందిన తెలంగాణ సిఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ఈస్థితికి చేరుకొంటుందని ముందే ఊహించారో లేదో తెలీదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఈ అవాంఛనీయ రాజకీయ వాతావరణాన్ని ఆయన అనుకూలంగా మార్చుకొని తెలంగాణ రాష్ట్రానికి అనేక ఐటి కంపెనీలను, అంతర్జాతీయ వాణిజ్య సంస్థలను, పరిశ్రమలను, లక్షల కోట్ల పెట్టుబడులను సులువుగా ఆకర్షించుకోగలిగారనే వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read – అసలే రోజులు బాలేవ్.. అమిత్ షాతో చంద్రబాబు ఏం చెప్పారో!
కేవలం 8 ఏళ్ళ స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకోవడం వెనుక టిఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధి, కృషి, ప్రయత్నాలు ఎంత ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులు కూడా ఎంతో కొంత తెలంగాణ అభివృద్ధికి దోహదపడ్డాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు కానీ ఇవి చేదు వాస్తవాలని అందరికీ తెలుసు. ఏపీలో పరిస్థితులు ఇలా ఉన్నంతకాలం ఇరుగుపొరుగు రాష్ట్రాలకు ఢోకా లేదనే మాట సర్వత్రా వినబడుతోంది. కనుక వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపైనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆధారపడి ఉందని మాత్రం చెప్పవచ్చు.