డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనితా వంగలపూడి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ భరత్, టీడీపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు తదితరులు నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు.
ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు చనిపోవడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇటువంటి సమయంలో మంత్రులు పరామర్శించడానికి వచ్చినప్పుడు సహజంగానే ఆవేశంతో వారు మాట్లాడారు. కొందరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి మంత్రులను నిలదీశారు.
కార్మిక సంఘాల నేతలు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కాస్త సహనం కోల్పోయి ఆవేశంగా జవాబులు చెప్పినప్పటికీ, మళ్ళీ సర్దుకొని ఓపికగా వారికి కొన్ని విషయాలు చెప్పారు.
“మేము పరామర్శించి చెక్కులు చేతిలో పెట్టి వెళ్ళిపోవడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడుతుందని భరోసా ఇవ్వడానికే వచ్చాను.
ఈ ప్రమాదం జరిగిన వెంటంటే సిఎం చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారా స్వామితో మాట్లాడారు. నష్టపరిహారంతో బాధిత కుటుంబాలలో ఒక్కొక్కరికీ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగాలు ఇవ్వాలని పట్టుబట్టి ఒప్పించారు.
ఇక్కడ మీ అందరికీ ఇచ్చిన ప్రతీ హామీని నేటి నుంచి 90 రోజులలో నెరవేరుస్తానని నేను మాట ఇస్తున్నాను.,” అని చెప్పడంతో కార్మికులు, బాధిత కుటుంబాల సభ్యులు శాంతించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి నిలదీసిన కార్మిక సంఘాల నేతలకు సమాధానం చెపుతూ, “గత ఏడాది నేను, ఎంపీలు కలిసి కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో అర్ధరాత్రి 12.15 వరకు సమావేశమయ్యాము. ఈ అంశం గురించి చర్చించాము. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ కోసం ఆర్ధిక ప్యాకేజ్ విడుదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటున్నాము గనుకనే నేటికీ ప్లాంట్ నడుస్తోందని ప్రతీ కార్మికుడు గుర్తు పెట్టుకోవాలి,” అని అన్నారు.
డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని కూడా కార్మికులు, కార్మిక సంఘాల నేతల నుంచి నష్టపరిహారం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి నిలదీశారు. వారికి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.
గత వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర పోషించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేను ఇక్కడే నిలబడి ‘క్యాపిటివ్ మైన్స్’తో సహా అన్ని అంశాల గురించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు కార్మిక సంఘాల నేతలను రావాలని పిలిస్తే ఒక్కరూ ముందుకు రాలేదు.
మీరందరూ వేర్వేరు కార్మిక సంఘాల నేతలు కనుక మీమీ సంఘాల ఆలోచనలు భిన్నంగా ఉండవచ్చు. కానీ మనమందరం స్టీల్ ప్లాంట్ కార్మికులమే. కనుక స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలి కదా?
నాకు మీ సమస్యలు పరిష్కారం కావడమే ముఖ్యం తప్ప రాజకీయాలు కాదు. కానీ మేము మీ వద్దకు వస్తే మీరు మమ్మల్నే దోషులుగా నిలబెట్టి నిలదీయాలనుకోవడం సరికాదు.
మీ కార్మిక సంఘాల నేతలతో వరుసగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించి మీరు చెప్పేవని విని మీ సమస్యలు అర్థం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే అందరం కలిసి కేంద్ర మంత్రిని కలుద్దాము,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.




