తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రా పాలకులు దోచుకున్నారు. తెలంగాణ నీళ్ళని దోచేసుకుంటున్నారు. మళ్ళీ తెలంగాణపై రాజకీయ పెత్తనం చేయడానికి వచ్చేస్తున్నారు. తెలంగాణలో మీకేం పని? వంటి మాటలు మళ్ళీ వినపడుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్ తర్వాత ఇవి మరింతగా బిగ్గరగా వినిపిస్తున్నాయి.
అయితే ఒకప్పుడు సామాన్య మధ్యతరగతికి చెందిన కల్వకుంట్ల కుటుంబం ఇప్పుడు వేలకోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాదించుకోగలిగింది? అవన్నీ తెలంగాణలో సంపాదించుకున్నవే కదా? తండ్రి కేసీఆర్ హయంలో భారీగా అవినీతి జరిగిందని కల్వకుంట్ల కవిత స్వయంగా చెపుతున్నారు కదా?
జనసేన పార్టీని నడిపించడానికి తాను సినిమాలు చేయాల్సివస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పుకునేవారు. మరి కల్వకుంట్ల కవిత పార్టీ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా దానిని నిర్వహించగలుగుతున్నారు?అనే ప్రశ్న తరచూ వినిపిస్తూనే ఉంది.
కేసీఆర్ హయంలో జరిగిన అవినీతి గురించి తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కమీషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది కదా?
సరే! వారందరూ నీతి నిజాయితీపరులే!ఎవరూ పైసా అవినీతికి పాల్పడలేదు.
కానీ గత రెండున్నరేళ్ళుగా ఏసీబీ అధికారుల వలలో వందల కోట్ల ఆస్తులు పోగేసుకున్న అవినీతి అధికారులు చిక్కుతూనే ఉన్నారు కదా? అంటే తెలంగాణను, ప్రజలను వారు కూడా దోచుకుంటున్నారనే కదా?
తెలంగాణ ఏర్పడితే మంత్రదండం తిప్పినట్లు రాత్రికి రాత్రి సమస్యలన్నీ మాయం అయిపోతాయన్నట్లు నాడు కేసీఆర్ చెప్పేవారు. కానీ తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్ళ తర్వాత ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. కానీ వేలు, లక్షల కోట్ల అవినీతి, వందలు వేల ఎకరాల భూకబ్జాలు, ఫామ్‌హౌసుల గురించి మాటలు వినిపిస్తున్నాయి కదా?
కేటీఆర్, కవిత, హరీష్ రావు ముగ్గురూ తెల్లారిలేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మంత్రులు కమీషన్లకు అలవాటు పడిపోయారని ఆరోపిస్తూనే ఉన్నారు. మూసీ ప్రాజెక్టు, ఫ్యూచర్ సిటీ పేరుతో లక్ష కోట్ల అవినీతికి, వేల ఎకరాలు కొట్టేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు కదా?
అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల ఆరోపణల ప్రకారమే చూస్తే ఆ పార్టీలు, వాటి నేతలే తెలంగాణని దోచుకుంటున్నారని స్పష్టమవుతోంది కదా? మరి ఆంధ్రా పార్టీలను, నాయకులను నిందించడం దేనికి?




