అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే కానీ…

atchutapuram

పరిశ్రమలతో ఉద్యోగాలు, ఉపాది లభిస్తుంది. చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. అయితే వీటితో పాటు అప్పుడప్పుడు పెను ప్రమాదాలు, వాటితో విషాదాలు కూడా తప్పవు. అనకాపల్లి జిల్లా అచ్యుతపురం పారిశ్రామికవాడలో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో నిన్న మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో 17 మంది కార్మికులు మరణించగా మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ADVERTISEMENT

ప్రమాదం గురించి తెలియగానే సిఎం చంద్రబాబు నాయుడు హోమ్ మంత్రి అనితా వంగలపూడిని అచ్యుతాపురం పంపించారు. అత్యవసర చికిత్స అయిన వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా విశాఖ లేదా హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. ఈరోజు సిఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి స్వయంగా పరిస్థితిని సమీక్షించనున్నారు.

రెండు ప్రమాదకరమైన రసాయనాల మిశ్రమాన్ని రియాక్టర్ నుంచి స్టోరేజి ట్యాంకులోకి మార్చుతున్నప్పుడు ఆ మిశ్రమం లీక్ అవడంతో పెను విస్పోటనం జరిగింది. ఆ ధాటికి పరిశ్రమ గోడ, సీలింగ్ కూలిపోవడం, మంటలు చెలరేగడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది.

ఈ ప్రమాదంలో ఒకేసారి 17 మంది కార్మికులు మరణించడం చాలా బాధాకరం. అయితే మానవ తప్పిదాలు, సాంకేతిక లోపాల కారణంగానే ఎక్కువగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతుంటాయని పదేపదే నిరూపించబడుతూనే ఉంది.

2020, మే 7వ తేదీన విశాఖలో జనావాసాల మద్య ఉన్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు వ్యాపించగా 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ విషాదం ఇంకా కళ్ళ ముందు మెదులుతుండగానే ఈ ప్రమాదం జరుగడం చాలా బాధాకరమే.

ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు ప్రభుత్వమే సదరు సంస్థ నుంచి నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే ఎల్జీ పాలిమర్స్ సంస్థ నష్టపరిహారంగా రూ.143 కోట్లు కోర్టులో జమా చేసిన తర్వాతే హైకోర్టు ఆ పరిశ్రమని తిరుపతి జిల్లా శ్రీ సిటీ సెజ్‌కి తరలించడానికి అనుమతించింది. అదేవిదంగా అచ్యుతాపురం ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు సదరు సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తగు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేస్తుందని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories