టిడిపి యువ నేత నారా లోకేష్ నేడు నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో టిడిపి సీనియర్ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకొని పార్టీ పరువు తీసినందుకు చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలని లేకుంటే ఎంతటివారినైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఈ ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలతో కమిటీని నియమిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. వారి నివేదికను బట్టి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని చెప్పారు.
ఒకప్పుడు ఏవీ సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి చాలా సన్నిహితుడు. కుటుంబ స్నేహితుడుగా ఉండేవారు. కానీ భూమా దంపతులు చనిపోయిన తర్వాత వారి రాజకీయ వారసురాలిగా అఖిలప్రియ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వారివురు మద్య విభేదాలు మొదలయ్యి నేడు ఒకరిపై మరొకరు దాడి చేసుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకొనేవరకు వెళ్ళాయి. అంటే పరిస్థితి చేయి దాటిపోయిందని అర్దమవుతోంది.
ఇటువంటి అవకాశం కోసమే వైసీపీ ఎదురుచూస్తోందని, అవకాశం లభిస్తే ఇద్దరినీ రాజకీయంగా దెబ్బ తీస్తుందని అఖిలప్రియ, సుబ్బారెడ్డి ఇద్దరికీ బాగా తెలుసు. తమ కీచులాటల వలన తాము రాజకీయంగా నష్టపోవడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీని కూడా బలహీనపరుస్తున్నామని కూడా ఇద్దరికీ తెలుసు. అయినా ఇద్దరూ పంతాలకు పోయి ఈ స్థితికి దిగజారారు.
నారా లోకేష్ పార్టీని బలోపేతం చేసేందుకు ఎండనక, వాననక పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా జిల్లా పర్యటనలు చేస్తున్నారు. నారా లోకేష్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే పార్టీ ఇద్దరు సీనియర్ నేతలు ఈవిధంగా కీచులాడుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారు. కనుక చంద్రబాబు నాయుడు ఈ సమస్యను తక్షణం పరిష్కరించకపోతే పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం కనిపిస్తోంది.



