ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో అధికార వైసీపీ పార్టీలో రాజీనామాల పర్వం తెర మీదకు వచ్చింది.గత ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలిచిన ప్రతిష్టాత్మక స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ ఇంచార్జ్ లు ఒక్కక్కొకరుగా రాజీనామా బాట పడుతున్నారు.
టీడీపీ యువనాయకుడు అయినా లోకేష్ పై పోటీ చేసి గెలుపొందిన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, జగన్ కు అత్యంత సన్నిహితుడు అయినా ఆర్కే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం ఇప్పటికి తాడేపల్లిలో హాట్ టాపిక్ గానే నడుస్తుంది.
అయితే ఈ సారి ఇక్కడ టీడీపీ హవా స్పష్టంగా కనపడడంతోనే ఆర్కే ను తాత్కాలికంగా తప్పించి పార్టీ ఓడిపోయే స్థానంలో బీసీ అభ్యర్థిని అయినా గంజి చిరంజీవిని ఎంపిక చేసి పోటీలో నిలిపి బలి పశువును చేయడానికి జగన్ కొత్త డ్రామాకు తెర లేపారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు X ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నాలుగున్నరేళ్లుగా బీసీలను అన్ని రకాలుగా హింసించినా జగన్ కసి తీరలేదు. పీకే చిట్టా ప్రకారం వైసీపీ చిత్తూ చిత్తుగా ఓడిపోయే సీట్లన్నీ బీసీలకు కట్టబెట్టి బీసీలను బలిపశువులను చెయ్యాలని జగన్ చూస్తున్నాడు అంటూ వైసీపీ పార్టీ తీసుకున్న ఇంచార్జ్ ల మార్పు నిర్ణయం పై అయ్యన్న స్పందించారు.
గెలిచే స్థానాలకు తన అమాత్యులను మార్చుకుని, పార్టీకి బలం లేని, పట్టుకోల్పోయిన సీట్లలో బీసీలను నియమించడం అంటే జగన్ బీసీలను మోసం చెయ్యడమే అవుతుంది. ఇదేనా జగన్ బీసీలకు చేస్తున్న సామజిక సాధికారత అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.




