తంతే బూరెల బుట్టలో పడ్డాడు అనే సామెత ఇప్పుడు మాజీ ఇండియన్ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ విషయంలో నిజమయ్యింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ కోసం అధిష్టానం వద్ద లాబీయింగ్ చేసిన అజారుద్దీన్ కి నవీన్ యాదవ్ రూపంలో నిరాశ ఎదురయ్యింది.
అయితే ఆ నిరాశను ఎమ్మెల్సీ తో భర్తీ చేస్తారు అనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా మంత్రి పదవితో పూరించాలని చూస్తుంది. అవును అజారుద్దీన్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశపడితే అధిష్టానం మంత్రి పదవితో ఆశ్చర్యపరిచింది.
రేవంత్ సర్కార్ క్యాబినెట్ లో ముస్లిం మంత్రి లేకపోవడం, ఆ గ్యాప్ ని అజారుద్దీన్ తో ఫిల్ చేసి ముస్లిం ఓట్ బ్యాంకు ను తన పార్టీకి అనుకూలంగా మలచుకోవడానికి కాంగ్రెస్ ఈ వ్యూహంతో ముందుకొస్తుంది అనేది పొలిటికల్ వర్గాలలో విస్తృతంగా చర్చింపబడుతుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది వినడానికి చాల చిన్న విషయమే అయినప్పటికీ అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలకు ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అంశం. ఉప ఎన్నికల గెలుపు రేవంత్ పాలనకు – బిఆర్ఎస్ బలానికి చిహ్నంగా నిలవబోతుంది.
అయితే ఇప్పటికే ఈ గెలుపు దిశగా ముస్లిం ఓటర్లను తమ వైపుకు ఆకర్షించేందుకు MIM తో అనధికారిక పొత్తులోకి వెళ్ళింది కాంగ్రెస్. ఇక ఇప్పుడు అజారుద్దీన్ కు మంత్రి పదవి అంటే అది వారి కమ్యూనిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న గుర్తింపు, గౌరవంగా మారుతుంది.
త్వరలో జరగనున్న రేవంత్ క్యాబినెట్ విస్తరణలో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం చేసేందుకు అన్ని లైన్స్ ఇప్పటికే క్లియర్ అయినట్టు సమాచారం. అయితే అజారుద్దీన్ కి ఇచ్చే మంత్రి పదవి పై మాత్రం పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.
ముఖ్యమంత్రి రేవంత్ దగగరున్న అత్యంత కీలకమైన హోమ్ శాఖను అజారుద్దీన్ కి ఇవ్వనున్నారు అనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. మరి అందుకు కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత రాజకీయం ఒప్పుకుంటుందా.? అధిష్టానం ఒప్పించగలుగుతుందా.? అన్నది ఇక్కడ అత్యంత కీలకం కానుంది.







