జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఏ చిన్న రాజకీయ మార్పు చోటు చేసుకున్నా అది ఉపఎన్నికల ఫలితమే అంటూ అటు అధికార ఇటు ప్రతిపక్షాల మధ్య రాజీలేని రాజకీయం సాగుతుంది. ఇటువంటి కీలక నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గ విస్తరణకు సిద్దమయ్యింది.
అందుకు గాను మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను మంత్రి పదవి బరిలోకి దింపారు. అయితే ఇందుకు బీజేపీ అడ్డుపుల్ల వేస్తుందని, ఇందుకు తెరవెనుక బిఆర్ఎస్ మద్దతుందని కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది.
ఒక మాజీ ఎంపీ, మాజీ ఇంటర్ నేషనల్ క్రికెటర్ కి మంత్రి పదవి ఇస్తుంటే బీజేపీ మైనార్టీ వర్గానికి అవకాశం అందకూడదు అనే ఉద్దేశంతో కుట్ర రాజకీయాలకు తెరలేపుతుందంటూ మండిపడ్డారు మంత్రి బట్టి విక్రమార్క.
అయితే బీజేపీ, బిఆర్ఎస్ లు ఇది కేవలం కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుందని, ఈ నిర్ణయం ఉపఎన్నికలలో ప్రభావాన్ని చూపుతుందంటూ రేవంత్ సర్కార్ పై అభియోగాలు చేస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ ఓట్ బ్యాంకు ను ప్రభావితం చేయడానికి ఇటువంటి నిర్ణయానికి పూనుకుంటుందంటూ బీజేపీ, బిఆర్ఎస్ విమర్శలకు దిగుతుంది.
అయితే ఒక్క ఉపఎన్నిక ఇటు మత రాజకీయాలకు అటు కుల ప్రాతిపదికలకు నిలయమయ్యింది.




